తమ అందానికి మెరుగులు దిద్దుకోవాలన్న ఆరాటం ప్రతి మహిళలోనూ ఉంటుంది. ఇక ఈ విషయంలో మన అందాల తారలు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్‌స్క్రీన్ అయినా, ఆఫ్‌స్క్రీన్ అయినా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మేకప్ వేసుకున్నప్పుడే కాదు.. డీ-గ్లామరస్‌గానూ తమకు మరెవరూ సాటిరారంటూ అదరగొడుతుంటారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడమే తమ అందానికి కారణమంటూ పలు సందర్భాల్లో కొందరు నటీమణులు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. పైగా లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ క్యూట్ బ్యూటీస్ న్యాచురల్ ఫేస్‌ప్యాక్స్ ప్రయత్నిస్తూ.. ఆ ఫొటోలు, రెసిపీలను సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు కూడా! అలా తాజాగా మన కపూర్ సిస్టర్స్ కరిష్మా, కరీనాతో పాటు పటౌడీ బ్యూటీ సోహా అలీ ఖాన్ కూడా ఓ సహజసిద్ధమైన ఫేస్‌మాస్క్ వేసుకొని.. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇంతకీ వాళ్లు వేసుకున్న ఆ న్యాచురల్ ఫేస్ మాస్క్ ఏంటి? దానివల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..
చాలామంది ముద్దుగుమ్మలు ఈ లాక్డౌన్ సమయంలో తమకు నచ్చిన పనులు చేస్తూ, వంటలు నేర్చుకుంటూ, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతూ.. ఇలా విభిన్న రకాలుగా గడుపుతున్నారు. అయితే మన బెబో కూడా ఈ ఖాళీ సమయంలో తన అందంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే తాను ప్రయత్నించిన సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్, ఇతర బ్యూటీ చిట్కాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. అలా ఇటీవలే పసుపుతో తయారుచేసిన ఓ ఫేస్‌ప్యాక్ వేసుకొని తీసిన వీడియోను కరీనా ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఫేస్ మాస్క్‌తో మన ముందుకొచ్చిందీ పటౌడీ కోడలు.
ఇదెంతో ప్రభావవంతంగా ఉంది!
అయితే తాజాగా కపూర్ సిస్టర్స్ కరీనా, కరిష్మాలతో పాటు కరీనా ఆడపడుచు-పటౌడీ బ్యూటీ సోహా అలీ ఖాన్.. ఈ ముగ్గురూ మట్చా గ్రీన్ టీ ఫేస్ మాస్క్ వేసుకున్నారు. ఇలా క్లిక్‌మనిపించిన ఫొటోలను తమ ఇన్‌స్టా స్టోరీల్లో పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు బ్యూటీ పాఠాలు నేర్పించారు. మట్చా గ్రీన్ టీ ప్యాక్ వేసుకొని దిగిన తన ఫొటోతో పాటు తన చెల్లి ఫొటోను కొలేజ్ చేసి ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న కరిష్మా.. ‘ప్యాకింగ్-పౌటింగ్.. థ్యాంక్యూ నిషా సరీన్.. ఈ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంది..’ అంటూ రాసుకొచ్చింది. ఇక తాను మట్చా గ్రీన్ టీ ప్యాక్ వేసుకొని దిగిన సెల్ఫీని ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న సోహా.. ‘ఈ ప్యాక్ ఎంతో ప్రభావవంతంగా ఉంది.. థ్యాంక్యూ నిషా సరీన్..’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ముగ్గురి కామన్ ఫ్రెండ్, నటి అయిన నిషా సరీన్ కరీనాకు ఈ మట్చా ఫేస్ మాస్క్‌ను షేర్ చేసింది. అందుకే ఈ మాస్క్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందంటూ ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఆ క్రెడిటంతా నిషాకే అందించారు.

ఏంటీ మట్చా?
మట్చా అనేది ఒక రకమైన గ్రీన్ టీ. ఈ టీ పొడిని ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. ఈ క్రమంలో ముందుగా ఈ తేయాకులను ఎండ పడకుండా భద్రపరుస్తారు. తద్వారా ఆ ఆకుల్లో క్లోరోఫిల్ రెట్టింపవుతుంది. ఫలితంగా అమైనో ఆమ్లాల స్థాయులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఈ ఆకుల్ని మెత్తటి పొడిలా చేస్తారు. ఇలా తయారైందే మట్చా గ్రీన్ టీ. ఇది సాధారణ గ్రీన్ టీ కంటే ఎన్నో రెట్లు మంచిదంటున్నారు నిపుణులు.
అందం ఇనుమడిస్తుంది!

యాంటీఆక్సిడెంట్లు నిండి ఉన్న ఈ పొడిని ఫేస్‌ప్యాక్‌లు, ఫేస్ మాస్కుల్లో ఉపయోగించడం వల్ల పలు సౌందర్య ప్రయోజనాలు చేకూరతాయి. * మన చర్మ కణాల్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి ఈ గ్రీన్ టీ పొడిలో నిండి ఉన్న యాంటీఆక్సిడెంట్ల సొంతం. ఫలితంగా నల్లమచ్చలు, గీతలు, పిగ్మెంటేషన్, మొటిమలు.. వంటి చర్మ సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు. * మట్చా గ్రీన్ టీ పొడిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి. * చాలామందికి ముఖంపై పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడడం, తద్వారా ముఖమంతా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు దరిచేరడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే క్లోరోఫిల్ అధికంగా ఉండే ఈ మట్చా గ్రీన్ టీ ఫేస్‌ప్యాక్ వేసుకోవాల్సిందే. ఇది చర్మంపైన ముడతల్ని తగ్గిస్తుంది. తద్వారా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.
 * ఈ టీ పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మ అలర్జీలు, ఇతర చర్మ సమస్యలను దూరం చేస్తాయి. * అలాగే ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు చర్మ ఛాయను పెంపొందించడంలో తోడ్పడతాయి. * మట్చా గ్రీన్ టీలో ఉండే అధిక క్లోరోఫిల్ సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడడంతో పాటు.. వాతావరణంలోని హానికారక రసాయనాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చేస్తాయి. * ఈ టీ పొడిలో అధికంగా ఉండే విటమిన్ ‘కె’ కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను దూరం చేయడంలో తోడ్పడుతుంది.
|
ఇంతకీ దీన్నెలా వాడాలి?
ఈ మట్చా గ్రీన్ టీతో కలిగే సౌందర్య ప్రయోజనాలు పొందాలంటే దీన్ని వివిధ రకాలుగా మన బ్యూటీ రొటీన్లో భాగం చేసుకోవచ్చు.
 టోనర్‌గా..! ఈ టీ పొడితో టోనర్ తయారుచేసుకోవచ్చు.. ఇందుకోసం కొద్దిగా మట్చా గ్రీన్ టీ పౌడర్‌లో నీళ్లు పోసి.. అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్‌ని కలుపుకోవాలి. ఇలా తయారైన టోనర్‌ని రోజూ ముఖంపై స్ప్రే చేసుకోవాలి. ఈ టోనర్ ముఖంపై చేరిన మలినాలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 క్లెన్సింగ్ మాస్క్ వాతావరణంలోని కాలుష్య కారకాల వల్ల చర్మ రంధ్రాల్లో మలినాలు చేరతాయి. మరి, వాటిని తొలగించి చర్మాన్ని శుభ్ర పరచాలంటే మట్చా గ్రీన్ టీ పొడితో తయారుచేసిన ఈ క్లెన్సింగ్ మాస్క్‌ని ఉపయోగించాల్సిందే. ఇందుకోసం ఒకటిన్నర టేబుల్‌స్పూన్ ముల్తానీమట్టి, పావు టీస్పూన్ మట్చా గ్రీన్ టీ పొడి తీసుకొని ఇందులో టేబుల్‌స్పూన్ నీళ్లు పోసి మాస్క్‌లా కలుపుకోవాలి. కావాలంటే దీనికి మరిన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మాస్క్‌ను ముఖానికి అప్లై చేసుకొని అరగంట తర్వాత కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఫేస్ స్క్రబ్ ఒక టేబుల్‌స్పూన్ మట్చా గ్రీన్ టీలో పావు కప్పు చక్కెర, సరిపడినంత కొబ్బరి నూనె వేసి స్క్రబ్‌లా కలుపుకోవాలి. దీన్ని ముఖంపై పూతలా వేసుకొని రుద్దుకుంటే ముఖంపై చేరిన దుమ్ము-ధూళి తొలగిపోవడంతో పాటు మృతకణాలను కూడా సమర్థంగా తొలగించుకోవచ్చు.
 మొటిమలకు గుడ్‌బై! టేబుల్‌స్పూన్ మట్చా గ్రీన్ టీ పొడికి కొద్దిగా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలుపుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ మొటిమల్ని కలిగించే బ్యాక్టీరియాను సమూలంగా నిర్మూలించడంతో పాటు వాటివల్ల ముఖంపై ఏర్పడిన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.
 పొడి చర్మానికి.. కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంటుంది. అలాంటి వారికి మట్చా గ్రీన్ టీతో తయారుచేసిన ఈ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. మట్చా గ్రీన్ టీ పొడి, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పొడి బారిన చర్మం కొద్ది రోజుల్లోనే తేమను సంతరించుకుంటుంది. ప్రకాశవంతంగా మారుతుంది.
|
చూశారుగా.. మట్చా గ్రీన్ టీ వల్ల సౌందర్య పరంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో! మరి, ఇంకెందుకాలస్యం.. మనమూ ఈ గ్రీన్ టీని మన బ్యూటీ రొటీన్లో భాగం చేసుకుందాం.. అపురూప లావణ్యంతో మెరిసిపోదాం.. ఏమంటారు?