కరోనా ఎప్పుడైతే పురుడు పోసుకుందో ఇక అప్పట్నుంచి ఆ వైరస్ ముప్పును తప్పించుకోవడానికి మనమంతా తెగ చేతులు కడుగుతున్నాం. ఈ క్రమంలో సబ్బుల దగ్గర్నుంచి హ్యాండ్‌వాష్‌లు, శానిటైజర్లు.. వంటివి విచ్చలవిడిగా వాడుతున్నాం. అయితే కరోనా పుణ్యమాని చేతులు కడుక్కోవడం అనే మంచి అలవాటు మనకు అలవడినా.. ఇలా పదే పదే చేతుల్ని శుభ్రం చేసుకోవడం వల్ల కోమలంగా ఉండాల్సిన చేతులు పొడిబారిపోయి నిర్జీవంగా మారుతున్నాయి. ఇందుకు మనం ఉపయోగించే హ్యాండ్‌వాష్, హ్యాండ్ శానిటైజర్లలోని రసాయనాలు కూడా ఓ కారణమే. మరైతే, ఇలా పొడిబారిపోయిన చేతుల్ని తిరిగి కోమలంగా మార్చుకునేదెలా.. అని ఆలోచిస్తున్నారా? అందుకు ఓ చక్కటి చిట్కా సూచించింది బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో భాగంగా ఇంట్లోనే ఉంటోన్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. దీనికి సంబంధించిన చిట్కాను చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
కరోనా కట్టడిలో భాగంగా యావత్‌దేశం స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుకోకుండా వచ్చిన ఈ లాక్డౌన్ సెలవులను ఎవరికి తోచినట్లు వారు వినియోగించుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్‌కు అటు కరోనా జాగ్రత్తలు చెబుతూనే.. ఇటు తమ క్వారంటైన్ అనుభవాలు, అనుభూతులను పంచుకుంటున్నారు. మరికొందరు తారలు అభిమానులకు ఉపయోగపడే పలు చిట్కాల్ని సూచిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ రవీనా టాండన్ కూడా అదే పనిచేసింది. పదే పదే చేతులు కడగడం వల్ల అవి తేమను కోల్పోయి పొడిబారిపోయి నిర్జీవంగా మారడం సహజం. ఆ సమస్యను అధిగమించడానికి చక్కటి సలహా ఇచ్చిందీ అలనాటి అందాల తార.

పాలతో కోమలంగా..!
పొడిబారిన చేతుల్ని తిరిగి కోమలంగా ఎలా మార్చుకోవచ్చో వీడియో రూపంలో పంచుకుంది రవీనా. గతంలో ఓ సందర్భంలో తాను పంచుకున్న బ్యూటీ టిప్‌కి సంబంధించిన వీడియోను తాజాగా మళ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇలా చెప్పుకొచ్చింది. ‘పదే పదే చేతులు కడగడం వల్ల పొడిబారిపోయిన చేతుల్ని తిరిగి కోమలంగా, నిర్జీవమైన గోళ్లను తిరిగి ప్రకాశవంతంగా మార్చుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చగా చేసిన పాలను తీసుకోవాలి. ఇప్పుడు అందులో చేతుల్ని పెట్టి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై శుభ్రమైన నీటితో ఓసారి కడిగి, పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చేతులు కోమలంగా, గోళ్లు షైనీగా మారడం మీరు గమనించవచ్చు..’ అంటూ చక్కటి సౌందర్య చిట్కాను అందించిందీ బాలీవుడ్ మామ్.
అసలే కరోనా కాలం..కరవు కాలం..ఇంకా పాలతో సౌందర్య చిట్కాలా అంటారా? నిజమే.. అలాంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు..అలాంటి వాళ్ళు కనీసం చేతులు కడిగిన తర్వాత తరచూ మాయిశ్చరైజర్ అయినా రాసుకోవాలి.
ఇదీ ముఖ్యమే!
ఇక ఈ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న రవీనా.. ‘మీ చేతుల్ని ఎప్పుడూ కోమలంగా ఉంచుకోండి. ఈ కరోనా విపత్కర సమయాల్లో మనమెలాగైతే సామాజిక దూరం పాటించడం, పదే పదే చేతులు కడుక్కోవడం.. వంటివి చేస్తామో, అలాగే మన చేతుల్ని కోమలంగా, తేమగా ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుతం మనందరం ఎలాగో ఇంట్లో ఉంటున్నాం కాబట్టి.. ప్రతి బుధవారం ఏదో ఒక సహజసిద్ధమైన సౌందర్య చిట్కాను మీ ముందుకు తేవాలని నిర్ణయించుకున్నా.. ఇవన్నీ మిమ్మల్ని మరింత అందంగా మారుస్తాయని ఆశిస్తున్నా..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ బాలీవుడ్ అందం.
ఇప్పుడే కాదు.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా పలు సౌందర్య చిట్కాలను పంచుకుంది రవీనా. అయితే ఈ లాక్డౌన్ సమయంలో వారానికొకటి చొప్పున ప్రతి బుధవారం వాటిని మరోసారి మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందీ లవ్లీ మామ్. మరి, రవీనా చెప్పినట్లు- అటు పదే పదే చేతులు కడుక్కుంటూ కరోనాకు దూరంగా ఉందాం.. అలాగే మన చేతుల్ని, గోళ్లను కోమలంగా-ఆరోగ్యంగా ఉంచుకుందాం.. ఏమంటారు?