మండే ఎండాకాలం రాబోతోంది.. ఎండవేడిమి వల్ల వచ్చే చెమట, జిడ్డుదనం, మొటిమలు, అలర్జీ, క్రిములు.. ఇవన్నీ తలచుకుంటేనే ఎవరికైనా ‘బాబోయ్’ అనిపించడం సహజమే. వీటి నివారణకు చాలామంది బ్యూటీ ట్రీట్మెంట్స్, బయట దొరికే క్రీమ్స్.. అంటూ ఏవేవో సౌందర్య చిట్కాలను ఫాలో అయిపోతుంటారు. ఇలా ఎన్ని వాడినా కూడా.. శుభ్రత పాటించకపోతే అందాన్ని సంరక్షించుకోవడం కత్తి మీద సామే అవుతుంది. అందుకోసమే స్నానం చేసే సమయంలో చాలామంది స్క్రబ్బింగ్ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ ఎంత అత్యాధునిక స్క్రబ్ టూల్స్‌ని వాడినా.. సహజ పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్బర్స్ ముందు దిగదుడుపే అనడంలో సందేహం లేదు. న్యాచురల్‌గా లభించే పదార్థాలతో తయారుచేసిన ఈ స్క్రబ్బర్స్ని వాడడం వల్ల శరీరం పూర్తిగా శుభ్రపడడంతో పాటు మేనికి చక్కటి పోషణ కూడా అందుతుంది. తద్వారా ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందచ్చు. మరి, ఆ న్యాచురల్ స్క్రబ్బర్స్ ఏంటో తెలుసుకొని వాటిని మన సమ్మర్ బ్యూటీ కిట్‌లో చేర్చేసుకుందామా?
ఫైబర్ బాత్ స్క్రబ్బర్

సాధారణంగా జనపనారతో తయారుచేసిన బ్యాగ్స్, దుస్తులు, ఇతర యాక్సెసరీస్.. వంటివి మనకు తెలిసినవే. పైగా ఇవి పర్యావరణహితమైనవి కూడా! ఇలాంటి నారతోనే ఒళ్లు రుద్దుకునే స్క్రబ్బర్స్ని కూడా తయారుచేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు సౌందర్య నిపుణులు. ఆ కోవకు చెందిందే ఈ ‘ఫైబర్ బాత్ స్క్రబ్బర్’. Agave అనే మొక్క ఆకుల పీచు నుంచి తయారుచేసే ఈ స్క్రబ్బర్ అచ్చం మనం గిన్నెలు శుభ్రం చేసుకునే స్క్రబ్బర్‌లా ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా గుండ్రంగా ఉండే ఈ బాత్ స్క్రబ్బర్‌ని మనం స్నానం చేసే సమయంలో ఒళ్లు రుద్దుకోవడానికి ఉపయోగించచ్చు. దీంతో నేరుగా రుద్దుకోవడం లేదంటే ముందుగా ఒంటికి సోప్ లేదా లిక్విడ్ జెల్ లాంటిది అప్లై చేసుకొని ఆపై ఈ స్క్రబ్బర్‌తో రుద్దుకోవడం.. ఎలాగైనా చేయచ్చు.. ఫలితంగా శరీరంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోవడంతో పాటు మేనికి నిగారింపు చేకూరుతుంది. ఇది సహజసిద్ధమైన స్క్రబ్బర్ కావడం వల్ల చర్మంపై గీసుకుపోతుందని, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయనే భయం అవసరం లేదు. దీని నాణ్యతని బట్టి ధర రూ.250 నుండి రూ.500 వరకు ఉంటుంది.
లూఫా బ్రష్

సాధారణంగా మనం స్నానం చేసే క్రమంలో ఒంటిని రుద్దుకోవడానికి లూఫాలను వాడుతుంటాం. అయితే వాటి తయారీలో ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తుంటారు. మరి, అలాకాకుండా సహజసిద్ధమైన లూఫా ఉంటే బాగుంటుంది కదూ! అలాంటిదే ఈ ‘లూఫా బ్రష్’. లూఫా అనే కాయగూర గుజ్జు నుంచి ఈ బ్రష్‌ని తయారుచేస్తారు. ఫొటోలో చూపించినట్లుగా ఒక హ్యాండిల్ ఉండి.. దానికి చివర్లో ఈ బ్రష్ ఉంటుంది. ఈ లూఫాలో ఉండే పోషకాలు, లిపిడ్స్.. శరీరానికి తేమతో పాటు మెరుపును కూడా అందిస్తాయి. అయితే దీంతో నేరుగా ఒంటిని రుద్దుకోవచ్చు.. లేదంటే సోప్ లిక్విడ్ ముందుగా శరీరానికి అప్లై చేసుకొని ఆపై మృదువుగా రుద్దుకోవచ్చు. ఈ లూఫా బ్రష్‌లు ప్రస్తుతం విభిన్న ఆకృతుల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటి నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.75 నుండి రూ.500 వరకు ఉంటుంది.
టెర్రకోటా స్క్రబ్బర్

ఎన్ని తరాలు మారినా.. వేసవిలో కుండలో నిల్వ చేసిన నీటి రుచి, చల్లదనమే వేరని చెప్పచ్చు. మట్టిలో దాగున్న మహత్యమదే. అందుకే మన బామ్మల కాలం నాటి మట్టిపాత్రలకు ఇప్పుడు మళ్లీ గిరాకీ పెరిగిపోతోంది. కేవలం మట్టి పాత్రలే కాదు.. ఈ మట్టిని బ్యూటీ ట్రీట్మెంట్స్లో సైతం ఉపయోగించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మట్టితో తయారుచేసిన బాడీ స్క్రబ్బర్స్ సైతం ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అవే ‘టెర్రకోటా స్క్రబ్బర్స్’. వాతావరణ కాలుష్యం కారణంగా ఒంటిపై చేరిన దుమ్ము, ధూళిని సహజసిద్ధంగా వదిలించడంతో పాటు మేనికి మెరుపును అందించడానికి మన ముందుకొచ్చాయివి. చిత్రంలో చూపించిన విధంగా కాస్త మృదువుగా, ఇంకాస్త గరుకుగా విభిన్న ఆకృతుల్లో లభ్యమవుతున్నాయీ స్క్రబ్బర్స్. ఇక సున్నితమైన చర్మతత్వం గల వారికి మరింత సాఫ్ట్‌గా ఉండే స్క్రబ్బర్స్ కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.125 నుండి రూ.800 వరకు ఉంటుంది.
వెటివర్ స్క్రబ్బర్

వట్టివేరు మొక్క నుంచి తయారుచేసిన మ్యాట్స్ని మనం వేసవిలో చల్లదనం కోసం వాడుతూనే ఉంటాం. అయితే ఇదే గడ్డితో తయారుచేసిన బాడీ స్క్రబ్బర్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ గడ్డిలోని ఎన్నో ఔషధ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పలు చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి. అలాగే చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళిని, జిడ్డుదనాన్ని ఈ స్క్రబ్బర్స్ తొలగిస్తాయి. ఈ ‘వెటివర్ స్క్రబ్బర్’ ఫొటోలో చూపించినట్లుగా గుండ్రంగానే కాకుండా ఇతర ఆకృతుల్లో కూడా లభ్యమవుతుంది. ముందుగా శరీరానికి సోప్ లిక్విడ్ అప్లై చేసుకొని లేదంటే నేరుగానైనా దీంతో శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఈ గడ్డి మొక్కలోని సహజ పరిమళం శరీరాన్ని పరిమళభరితం చేస్తుంది కూడా! ఈ స్క్రబ్బర్ నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.70 నుండి రూ.300 వరకు ఉంటుంది.
రిడ్జ్గార్డ్ ఫైబర్ స్క్రబ్బర్

అదేనండీ... బీరకాయ పొట్టుతో చేసే స్క్రబ్బర్. ఈ కాయగూర రుచిలోనే కాదు.. పోషకాలలో కూడా రారాజే. దీని పైభాగంలోని పీచుతో రుచికరమైన పచ్చడి కూడా చేసుకొని ఆరగించేస్తాం. అయితే ఇదే పీచుని ఎండబెట్టి ‘రిడ్జ్గార్డ్ ఫైబర్ స్క్రబ్బర్’ని తయారుచేస్తారు. చిత్రంలో చూపించిన విధంగా అచ్చం పౌడర్ పఫ్లా ఉంటుందిది. దీన్ని చేతి వేళ్లకు అమర్చుకునేందుకు వీలుగా ఓ మృదువైన హ్యాండిల్ కూడా ఉంటుంది. పొడిగా ఉన్నప్పుడు కాస్త గరుకుగా, నీటిలో తడపగానే మృదువుగా మారే ఈ స్క్రబ్బర్‌తో ఒంటిని రుద్దుకుంటే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. దీని నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.199 నుండి రూ.400 వరకు ఉంటుంది.
గమనిక: వీటిని వాడిన తర్వాత శుభ్రం చేసి, ఎండలో ఆరబెట్టడం మరువకండి. తద్వారా ఈ స్క్రబ్స్పై క్రిములు చేరడాన్ని నివారించవచ్చు. ఏ మాత్రం అలక్ష్యం చేసినా.. వాటిలో క్రిములు చేరే అవకాశం ఉంది. తద్వారా చర్మ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ స్క్రబ్బర్స్ ఎంత శుభ్రంగా ఉంటే మీ చర్మం అంత ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోతుందని గుర్తుంచుకోండి.
మగువల అందాన్ని పెంపొందించడంలో ఉపయోగపడే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని మిస్ కాకుండా చదవండి.
Photos: Amazon.in