ముందుంది అంతా మండే ఎండాకాలం.. ఆ పేరు తలచుకోగానే ఉక్కపోత, చెమట.. బాబోయ్ అనిపిస్తుంది.. మరోవైపు ఆ వేడిని తట్టుకోలేక చిరాకేస్తుంది కూడా! మరి, అలా జరగకుండా ఉండాలంటే మనతో పాటే బయటికి తీసుకెళ్లే ఓ మినీ ఫ్యాన్ ఉంటే బావుండు.. అని చాలామంది అప్పుడప్పుడూ అనుకుంటూనే ఉంటారు. అలాంటి వారి కోసమే ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే రీఛార్జబుల్ ఫ్యాన్స్ ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అవునండీ మీరు విన్నది నిజమే.. ఎక్కడికెళ్లినా గాలి కోసం ఇబ్బందిపడాల్సిన పనిలేకుండా, చెమటకు మేకప్ చెదిరిపోయి అందవిహీనంగా కనిపిస్తామన్న భయం లేకుండా ఈ బుజ్జి ఫ్యాన్స్‌ని ఎంతో ఈజీగా పాకెట్లోనో లేదా హ్యాండ్ బ్యాగ్‌లోనో పెట్టుకుని వెంటతీసుకెళ్లచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని ఉపయోగించుకోవచ్చు. వింటుంటేనే ఎంతో హాయిగా అనిపిస్తోంది కదూ! మరైతే ఆలస్యమెందుకు.. విభిన్న రకాలైన ఈ మినీ ఫ్యాన్స్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

నెక్‌బ్యాండ్ మినీ ఫ్యాన్
ప్రస్తుతం మార్కెట్లో నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ రాజ్యమేలుతున్నాయి. ఎవరిని చూసినా బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌ని మెడలో వేసుకుని తిరుగుతున్నారు. దీని వల్ల అటు ఫోన్లో మాట్లాడడానికైనా, పాటలు వినడానికైనా ఎంతో ఈజీగా ఉండడంతో పాటు యువతను ట్రెండీగా, స్టైలిష్‌గా మార్చేస్తుందీ గ్యాడ్జెట్. మరి యువతను ఇంతగా కట్టిపడేసిన ఇలాంటి మోడల్లోనే మినీ ఫ్యాన్ డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు డిజైనర్లు. అదే ‘నెక్‌బ్యాండ్ మినీ ఫ్యాన్’.
చిత్రంలో చూపించిన విధంగా అచ్చం బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌లా ఉంటుందిది. ఇయర్‌ఫోన్స్‌కు బదులుగా దీని రెండు అంచులకు రెండు ఫ్యాన్స్ అమరి ఉంటాయి. ఇది ఛార్జింగ్ ద్వారా పని చేస్తుంది. ఇందులో మూడు రకాలైన స్పీడ్ లెవెల్స్ ఉంటాయి. వీటిని ఎడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన స్పీడ్‌ను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫ్యాన్స్‌ని ఎలా కావాలంటే అలా 360 డిగ్రీల్లో తిప్పుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ నాణ్యతని బట్టి ధర రూ.300 నుండి రూ.1200 వరకు ఉంటుంది.

నెక్లెస్ రీఛార్జబుల్ ఫ్యాన్
ముఖానికి మరీ దగ్గరగా ఫ్యాన్స్ ఉండడం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాంటి వారికోసం ఈ ‘నెక్లెస్ రీఛార్జబుల్ ఫ్యాన్’ బాగా ఉపయోగపడుతుంది. చిత్రంలో చూపించిన విధంగా మెడలో ట్యాగ్‌లా దీన్ని ధరించవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆన్ చేసి పట్టుకోవాల్సిన పనిలేకుండానే మీ ముఖానికి తగిలేలా ఈ ఫ్యాన్‌ను అమర్చుకోవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌కి కింది భాగంలో చిన్న స్టాండ్ లాంటి అమరిక ఉంటుంది. ఈ స్టాండ్ ద్వారా టేబుల్ మీద కూడా పెట్టుకుని మీ ముఖానికి తగిలే విధంగా ఈ మినీ ఫ్యాన్‌ను అమర్చుకోవచ్చు. అంతేకాదు.. చాలా ఈజీగా మెడలో వేసుకునే వీలుండడం వల్ల మీరెక్కడికైనా దీన్ని తీసుకెళ్లవచ్చు. ఛార్జింగ్ ద్వారా పనిచేసే ఈ ఫ్యాన్ నాణ్యతని బట్టి ధర రూ.800 నుండి రూ.3000 వరకు ఉంటుంది.

పోర్టబుల్ హ్యాండీ ఫ్యాన్
వచ్చేది ఎండాకాలం.. కరెంట్ కోతలు కూడా ఉండచ్చు. మరి, హఠాత్తుగా కరెంటు పోయినప్పుడు గాలితో పాటు లైట్ కూడా కావాలంటే అందుకు ‘పోర్టబుల్ హ్యాండీ ఫ్యాన్’ చక్కటి ఎంపిక. దీన్ని ప్రయాణంలోనో లేదా రూమ్‌లోనో ల్యాంప్స్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. చిత్రంలో చూపించిన విధంగా అచ్చం పెన్‌లా లేదంటే పాకెట్ పెర్ఫ్యూమ్లా ఉంటుందీ ఫ్యాన్. ఫ్యాన్ రెక్కలన్నీ ఒక చోటికి చేర్చి క్లోజ్డ్గా ఉన్న దీన్ని పెన్ మాదిరిగానే పైకి జరుపుతూ ఓపెన్ చేయాలి. ఆపై రెక్కల్ని కూడా చుట్టూ సమానంగా జరిపితే ఫొటోలో చూపించినట్లుగా చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండే బుల్లి ఫ్యాన్ మాదిరిగా కనిపిస్తుంది. ఛార్జింగ్ ద్వారా పనిచేసే ఈ ఫ్యాన్‌ను స్విచ్ ఆన్ చేస్తే చల్లటి గాలిని ఆస్వాదించచ్చు. ఎంతో అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉండే ఈ ఫ్యాన్ నాణ్యతని బట్టి దీని ధర రూ.500 నుండి రూ.900 వరకు ఉంటుంది.

టేబుల్ పోర్టబుల్ ఫ్లెక్సిబుల్ ఫ్యాన్
ఎండాకాలంలో కరెంట్ కోతలు సహజం. ఈ క్రమంలో మేకప్ వేసుకునేటప్పుడే కరెంట్ పోయిందనుకోండి.. చెమటకు వేసుకున్న మేకప్ అంతా పాడైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ ‘టేబుల్ పోర్టబుల్ ఫ్లెక్సిబుల్ ఫ్యాన్’ని ఎంచుకోవాల్సిందే! చిత్రంలో చూపించిన విధంగా చిన్న సైజు టేబుల్ ఫ్యాన్‌లా ఉంటుందిది. ఛార్జింగ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. మనం మేకప్ వేసుకునే సమయంలో దీన్ని డ్రస్సింగ్ టేబుల్‌పై అమర్చుకున్నామంటే కరెంట్ పోయినా ఎలాంటి తిప్పలూ పడాల్సిన పనిలేదు. అంతేకాదు.. నిద్రించే సమయంలోనూ దీన్ని మన బెడ్ దగ్గర టేబుల్‌పై అమర్చుకుంటే తలకు గాలి బాగా తగిలి హాయిగా నిద్రపడుతుంది. దీని నాణ్యతని బట్టి ధర రూ.399 నండి రూ.599 వరకు ఉంటుంది.

పోర్టబుల్ మొబైల్ ఫ్యాన్
ఈ కాలంలో అందరి అరచేతుల్లోనూ స్మార్ట్ఫోన్లే! నడుస్తున్నా.. బస్‌లో వెళ్తున్నా.. ఆఫీస్‌లో పనిచేస్తున్నా.. మొబైల్ చేతిలో ఉండాల్సిందే. అలా మనం ఎక్కడున్నా మనతో పాటు ఉండే మొబైల్‌కే ఓ మినీ ఫ్యాన్ అమర్చుకోగలిగితే సూపర్బ్‌గా ఉంటుంది కదూ! అందుకే ఈ ‘పోర్టబుల్ మొబైల్ ఫ్యాన్’ని డిజైన్ చేశారు డిజైనర్లు. చిత్రంలో చూపించిన విధంగా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌కి ఈ చిట్టి ఫ్యాన్‌ని అమర్చితే చాలు.. స్విచ్‌తో పనిలేకుండానే ఫ్యాన్ తిరుగుతుంది. అవసరం లేదనుకున్నప్పుడు ఫ్యాన్‌ని పోర్ట్ నుంచి తొలగిస్తే సరి. ఇలా ఓవైపు మొబైల్ ఆపరేట్ చేస్తూనే.. మరోవైపు చల్లటి గాలిని ఆస్వాదించచ్చు. ఈ మినీ ఫ్యాన్లు వివిధ రంగుల్లోనూ లభిస్తాయి. సో.. మీ మొబైల్ కలర్‌కి అనుగుణంగా దాన్ని ఎంచుకోవచ్చు. దీని నాణ్యతని బట్టి ధర రూ.299 నుండి రూ.599 వరకు ఉంటుంది.
గమనిక: ఇలా మగువల అందాన్ని పెంపొందించడంతో పాటు సౌందర్య పరిరక్షణలోనూ వారి పనిని మరింత సులభతరం చేసే మరిన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని మిస్ కాకుండా చదవండి.