అందమంటే ముఖం, చేతులు, జుట్టు.. వీటిపైనే ఎక్కువ శ్రద్ధ పెడతాం. కానీ పాదాల విషయానికొచ్చే సరికి అంతగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. కొంతమందైతే కనీసం నెలకొకసారి కూడా పాదాల్ని సరిగా శుభ్రం చేసుకోరు. కానీ, వాటిని అలాగే వదిలేయడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి చేరి పాదాలు పొడిబారిపోయి అంద విహీనంగా కనిపించడం, కాలి వేళ్ల మధ్య అలర్జీలు రావడం.. వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలంటే పాదాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అందుకోసమే ప్రస్తుతం విభిన్నమైన పెడిక్యూర్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి అందుబాటులోకొచ్చేశాయి. అవి పాదాల సమస్యల్ని తొలగించడంతో పాటు పాదాలకు మెరుపును కూడా అందిస్తాయి. మరి, ఏంటా గ్యాడ్జెట్స్? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

ఎలక్ర్లిక్ నెయిల్ డ్రిల్ మెషీన్
కాలి వేళ్ల సందుల్లో దుమ్ము, ధూళి ఎక్కువగా చేరడం సహజం. కానీ వేళ్లలోని మురికిని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. అలాగని పైపైన శుభ్రం చేసుకుంటూ పోతే కొన్ని రోజులకు ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కాలి వేళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ ‘ఎలక్ర్లిక్ నెయిల్ డ్రిల్ మెషీన్’ రూపొందించారు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. చిత్రంలో చూపించిన విధంగా వేళ్లను శుభ్రం చేసుకోవడానికి ఇందులో 5 రకాల పరికరాలుంటాయి. మీకు కావాల్సిన విధంగా ఒక్కో పరికరాన్ని మెషీన్‌కు అమర్చుకుంటూ మీ కాలి వేళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా వేళ్ల అంచుల్లో, గోళ్లలో ఉన్న మురికి శుభ్రం చేసుకోవడానికి ఒక పరికరం ఉపయోగపడితే.. మీ గోళ్లను చక్కగా షేప్ చేసుకోవడానికి మరో పరికరం తోడ్పడుతుంది. ఇలా ఈ టూల్స్ సహాయంతో కేవలం కాలి వేళ్లే కాకుండా చేతి వేళ్ల గోళ్లను కూడా తీరైన షేప్‌లో తీర్చిదిద్దుకోవచ్చు. ఈ డ్రిల్ మెషీన్ టూల్స్ వాడే విధానం గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే దాంతో పాటు వచ్చే గైడ్‌లైన్స్ బుక్లెట్ చదివితే సరి. భలే బాగుంది కదూ ఈ గ్యాడ్జెట్. దీని నాణ్యతని బట్టి ధర రూ.150 నుండి రూ.800 వరకు ఉంటుంది.

ఫుట్ స్టాండ్ విత్ లైట్
చక్కగా నెయిల్స్ని శుభ్రం చేసుకుని, షేప్ చేసుకున్నాక.. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే చేతి వేళ్లకు పాలిష్ వేసుకోవడం కాస్త ఈజీగానే ఉంటుంది.. కానీ కాలి గోళ్ల విషయానికొచ్చేసరికి.. నెయిల్ పెయింట్ పెట్టుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. అందులోనూ సరైన పొజిషన్లో కూర్చోకుండా నెయిల్ పాలిష్ వేసుకుంటే సరిగ్గా కుదరకపోవచ్చు. అయితే ‘ఫుట్ స్టాండ్ విత్ లైట్’ మీ బ్యూటీ కిట్‌లో ఉంటే ఇక ఎలాంటి ఇబ్బందీ పడక్కర్లేదు. మనం సాధారణంగా ఫుట్ వేర్ దుకాణాల్లో చూసే స్టాండ్ మాదిరిగానే ఉంటుందిది. చిత్రంలో చూపించిన విధంగా ఈ స్టాండ్‌ని మనం సోఫాకు, సోఫా కుషన్కి మధ్య కూడా అమర్చుకోవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా స్టాండ్‌పై పాదాన్ని ఉంచి నెయిల్ పెయింట్‌ని ఈజీగా వేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్టాండ్‌పై నెయిల్ పెయింట్ బాటిల్‌ని కూడా పెట్టుకునే వీలుంటుంది. ఒకవేళ చుట్టూ కాస్త చీకటిగా ఉంటే ఇందులో ఒక లైట్ కూడా అమరి ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే సరి.. ఇక ఈ ఫుట్స్టాండ్తో పని పూర్తైన తర్వాత దీన్ని మడతపెట్టేసుకొని ఎక్కడైనా ఈజీగా భద్రపరచుకోవచ్చు. ఈ ఫుట్ స్టాండ్ నాణ్యతను బట్టి ధర రూ.550 నుండి రూ. 1700 వరకు ఉంటుంది.

ఫుట్ స్క్రబ్బర్ విత్ ప్యూమిస్ స్టోన్
స్నానం చేసే సమయంలో సబ్బుతో పాదాలపైన తెగ రుద్దుకోవడం మనం రోజూ చేసేదే. కానీ పాదాల కింది భాగాన్ని అంటే అరికాళ్లను కూడా రోజువారీ స్నానంలో భాగంగా క్లీన్ చేసుకుంటే అరికాళ్లలో మురికి చేరకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అందుకు పెద్దగా కష్టపడక్కర్లేదు. పాదాల రోజువారీ క్లీనింగ్ కోసం ఈ ‘ఫుట్ స్క్రబ్బర్ విత్ ప్యూమిస్ స్టోన్’ అనే గ్యాడ్జెట్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. చిత్రంలో చూపించిన విధంగా ఇది బ్రష్‌లా ఉంటుంది. కింది భాగంలో చిన్న ప్యూమిస్ స్టోన్ ఉంటుంది. దీంతో మడమల భాగంలో పేరుకున్న మురికిని తొలగించుకోవచ్చు. దీనికి ఇరువైపులా పాదాల్ని పెట్టుకునేలా ప్లేట్లాంటి అమరిక కూడా ఉంటుంది. ప్రతి రోజూ స్నానమాచరించే సమయంలో ఈ గ్యాడ్జెట్ మధ్యలో ఉన్న బ్రష్‌పై అరికాళ్లను ఉంచి ముందుకూ వెనక్కి నెమ్మదిగా రుద్దుతూ ఉండడం ద్వారా పాదాల్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇక పాదాల మడమలను క్లీన్ చేయడానికి కింది వైపు ప్యూమిస్ స్టోన్ ఉండనే ఉంది. ఈ ప్రక్రియని మీ రోజువారీ స్నానంలో భాగం చేసుకోవడం వల్ల పాదాల్లో మురికి చేరే అవకాశం అస్సలు ఉండదంటే నమ్మండి. ఈ గ్యాడ్జెట్ నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.400 నుండి రూ.1200 వరకు ఉంటుంది.

ఫోల్డబుల్ ఫుట్ బాత్ బేసిన్
సాధారణంగా పెడిక్యూర్ చేయించుకోవాలంటే చాలామంది బ్యూటీ పార్లర్లని ఆశ్రయిస్తుంటారు. కానీ, స్పాలో చేసుకునేంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోగలిగితే.. బాగుంటుంది కదూ.. అనుకుంటున్నారా? అందుకోసం ఈ ‘ఫోల్డబుల్ ఫుట్ బాత్ బేసిన్’ మీ ఇంట్లో ఉంటే సరి. చిత్రంలో చూపించిన విధంగా చిన్న టబ్లా ఉంటుందీ గ్యాడ్జెట్. దీనికి అడుగు భాగంలో రోలర్స్ అమరి ఉంటాయి. ఇందులో పాదాలు మునిగేంత వరకు గోరువెచ్చని నీటిని నింపి.. అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ నూనె, కాస్త ఉప్పును వేయాలి. ఇప్పుడు ఇందులో పాదాల్ని ఉంచి.. అడుగున ఉన్న రోలర్స్ సాయంతో పాదాల్ని ముందుకూ వెనక్కి అనడం ద్వారా ఓవైపు వేడి నీటి వల్ల పాదాలకు రిలాక్సేషన్ లభిస్తుంది.. మరోవైపు రోలర్స్ వల్ల అరికాళ్లకు చక్కటి మసాజ్ కూడా అవుతుంది. తద్వారా పాదాల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పాదాలూ తేమగా, మృదువుగా మారతాయి. ఇక, మీ పని పూర్తైన తర్వాత ఈ టబ్‌ని మడిచి.. ఎక్కడంటే అక్కడ అమర్చుకోవచ్చు. అంతేకాదు.. మీరు ఎక్కడికైనా దీన్ని మీ వెంటే ఈజీగా తీసుకెళ్లవచ్చు. దీని నాణ్యతని బట్టి ధర రూ.850 నుండి రూ. 1500 వరకు ఉంటుంది.

ఎగ్ షేప్ ఫుట్ స్క్రబ్బర్
మనలో చాలామంది టైం లేకనో లేదా నిర్లక్ష్యం వల్లనో పాదాల్ని శుభ్రం చేసుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. తద్వారా కాలి మడమలు పగలడం.. అక్కడ బాగా దుమ్ము చేరి రఫ్‌గా తయారవడం జరుగుతుంది. అంతేకాదు.. ఇలా మడమల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అక్కడ మృతచర్మం కూడా ఏర్పడుతుంది. దీన్ని తొలగించడానికి కాస్త కఠినంగా ఉండే స్క్రబ్బర్ వాడాల్సి ఉంటుంది. అలాంటిదే ఈ ‘ఎగ్ షేప్ ఫుట్ స్క్రబ్బర్’. చిత్రంలో చూపించిన విధంగా గుడ్డు ఆకారంలో లేదా కంప్యూటర్ మౌస్ ఆకృతిలో ఉంటుందీ గ్యాడ్జెట్. దీనికి అడుగుభాగంలో స్క్రబ్బర్ అమరి ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా ఈ టూల్ సహాయంతో నెమ్మదిగా, మృదువుగా రుద్దుతూ కాలి మడమల వద్ద పేరుకున్న మృతచర్మాన్ని తొలగించుకోవాలి. అయితే అందుకోసం ముందుగా గోరువెచ్చని నీటిలో ఓ 10-15 నిమిషాల పాటు పాదాలను నాననిచ్చి.. ఆపై ఈ స్క్రబ్బర్‌ని ఉపయోగిస్తే డెడ్స్కిన్ తొలగించడం సులువవుతుంది. అంతేకాదు.. మనం తొలగించే మృతచర్మం ఈ టూల్ వెనుక భాగంలో ఉన్న బాక్స్ లాంటి అమరికలో పడిపోతుంది. ఆపై దాన్ని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పాదాలను గోరువెచ్చటి నీటిలో అలాగే కాసేపు నానబెట్టుకుంటే ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఈ టూల్ నాణ్యత, డిజైన్ని బట్టి ధర రూ.450 నుండి రూ.1200 వరకు ఉంటుంది.
మగువల అందాన్ని, సౌందర్య పరిరక్షణలో వారి పనిని సులభతరం చేసే ఇలాంటి బోలెడన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vadundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసాన్ని చదవండి.