‘జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేయగలదు..’ ఇది ఒకప్పటి సామెత. కానీ ‘ఎంత చిన్న జుట్టున్నా.. ఎంత పెద్ద కొప్పుగానైనా మలచుకోవచ్చు..’ ఇది నేటి తరం అమ్మాయిలు పాటిస్తోన్న బ్యూటీ ట్రెండ్. పెరిగిపోతున్న కాలుష్యం, రసాయనాలు కలిసిన షాంపూలు, బయట దొరికే హెయిర్ కేర్ ఉత్పత్తుల ప్రభావం వల్ల ఒత్తైన జుట్టును పొందాలనుకున్న ఈ తరం అమ్మాయిల కల కలగానే మిగిలిపోతోంది. ఇలా చేసేదేమీ లేక.. ఉన్న షార్ట్ హెయిర్‌తోనే స్టైలిష్‌గా మెరిసిపోయే మార్గాల గురించి అన్వేషిస్తున్నారు చాలామంది అమ్మాయిలు. ఈ క్రమంలోనే జుట్టు చిన్నగా ఉన్నా పొడవుగా కనిపించేలా, సన్నగా ఉన్నా లావుగా కనిపించేలా, విభిన్న హెయిర్‌స్టైల్స్ వేసుకునేందుకు వీలుగా.. ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ‘హెయిర్ ఎక్స్టెన్షన్స్’గా పిలిచే ఇలాంటి టూల్స్‌తో ఏ హెయిర్‌స్టైల్ అయినా చిటికెలో వేసేసుకొని రడీ అయిపోవచ్చు.. పైగా ఈ పెళ్లిళ్ల సీజన్ హడావిడిలో ఇలాంటి హెయిర్‌స్టైలింగ్ గ్యాడ్జెట్లు బాగా ఉపయోగపడతాయి కూడా! మరి, అవేంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటి సహాయంతో నిమిషాల్లో మీకు నచ్చిన హెయిర్‌స్టైల్‌ని ఎలా వేసుకోవచ్చు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

ఫ్రంట్ ఎక్స్టెన్షన్ హెయిర్ క్లిప్
మన ముఖంపై ముంగురులు అలా కదలాడుతూ ఉంటే ఆ అందమే వేరు. అందుకోసమే చాలామంది అమ్మాయిలు జుట్టు ముందు భాగంలో ఫంక్ కట్ చేయించుకుంటారు. కానీ.. ఇప్పటికిప్పుడే జుట్టును ఉన్న స్టైల్లో నుంచి వేరే స్టైల్లోకి మార్చాలంటే.. అంత సులభంగా అయ్యే పని కాదు. మళ్లీ జుట్టు పొడుగ్గా పెరిగేదాకా కొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఇందుకోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కూడా! మరి, అలాకాకుండా మీరనుకున్నప్పుడల్లా మీ జుట్టు ముందు భాగంలో నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవాలనుకుంటే.. అందుకోసం మన జుట్టును కట్ చేయాల్సిన అవసరం లేదు.. మరెలా అనుకుంటున్నారా? అందుకోసమేగా ‘ఫ్రంట్ ఎక్స్టెన్షన్ హెయిర్ క్లిప్’ అందుబాటులోకొచ్చేసింది!
చిత్రంలో చూపించిన విధంగా ఫంక్ హెయిర్ కట్‌తో రూపొందించిన హెయిర్ ఎక్స్టెన్షన్ నేరుగా మార్కెట్లో లభిస్తుంది. ఈ ఫేక్ జుట్టుకు వెనకభాగంలో క్లిప్స్ అమర్చి ఉంటాయి. వాటిని మన జుట్టుకు ముందు భాగంలో ఫొటోలో చూపించినట్లుగా అటాచ్ చేసుకుంటే సరి. మిగిలిన జుట్టును మీకు నచ్చిన స్టైల్లో తీర్చిదిద్దుకోవచ్చు. కానీ వీటిని ఎంచుకునేటప్పుడు మీ హెయిర్ కలర్‌తో సరిపోయేలా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని మరీ ఎంచుకోవడం మంచిది. వీటి డిజైన్, నాణ్యతని బట్టి ధర రూ.180 నుండి రూ.600 వరకు ఉంటుంది.

ఆర్టిఫిషియల్ బన్
ఎలాంటి సందర్భానికైనా, ఎలాంటి అటైర్కైనా.. ఇట్టే నప్పేస్తుంది బన్ హెయిర్ స్టైల్. పైగా ఇది మనకు మరింత అందాన్ని, ట్రెండీ లుక్‌ని అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ బన్ హెయిర్ స్టైల్ వేసుకోవడం అంత ఈజీ కాదు.. ఎంత చక్కగా ముడి వేసుకోవాలనుకున్నా అది వదులుగా అయిపోవడం.. ఒక్కోసారి మధ్యలోనే ఊడిపోవడం.. జరుగుతూనే ఉంటుంది. ఇంత కష్టం లేకుండా క్లిప్లాగా లేదా హెయిర్ బ్యాండ్లాగా పెట్టుకునే బన్ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? అలాంటి వారికోసం రూపొందించిందే ఈ ‘ఆర్టిఫిషియల్ బన్’.
ఫొటోలో చూపించినట్లుగా ఇది క్లిప్, బ్యాండ్.. ఇలా రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తుంది. దీనికోసం ముందుగా మీ జుట్టును ముడి వేసుకోవాలి. ఆపై ఈ క్లిప్ లేదా బ్యాండ్ బన్ని మీ జుట్టుపై అమర్చుకుంటే సరిపోతుంది. అంతే! కేవలం నిమిషాల్లో చక్కనైన బన్ హెయిర్‌స్టైల్‌లో మీరు రడీ అయి పార్టీకి వెళ్లచ్చు. ఈ టూల్స్లోనూ విభిన్న రకాల బన్ క్లిప్స్ లేదా బ్యాండ్స్ కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి డిజైన్, నాణ్యతని బట్టి ధర రూ. 200 నుండి రూ.800 వరకు ఉంటుంది.

కలర్‌ఫుల్ హెయిర్ స్ట్రీక్ ఎక్స్టెన్షన్
ప్రస్తుతం హెయిర్ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత స్టైలిష్‌గా మెరిసిపోవచ్చనుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు. అందుకోసం జుట్టుకు వివిధ కలర్స్‌ని అద్దడం కామనైపోయింది. కానీ వాటిలోని రసాయనాల వల్ల జుట్టు రాలడం, నిర్జీవంగా తయారవడం జరుగుతుంది. మరి మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటూనే కలర్ఫుల్గా మెరిసిపోవాలంటే వెంటనే మీ బ్యూటీ కిట్‌లో ఈ ‘కలర్‌ఫుల్ హెయిర్ స్ట్రీక్ ఎక్స్టెన్షన్’ని చేర్చుకుంటే సరి. చిత్రంలో చూపించిన విధంగా వివిధ రంగులు లేదా మీకు నచ్చిన ఒకే కలర్లో ఉండే హెయిర్ క్లిప్స్‌కి అటాచ్ చేసి ఉంటుంది. ఈ క్లిప్స్‌ని మీ జుట్టు లోపలి భాగంలో కనిపించకుండా అక్కడక్కడా పెట్టుకుంటే సరిపోతుంది. అంతే! రెయిన్బో కురులు మీ సొంతం..! వీటి కలర్ కాంబినేషన్, నాణ్యతని బట్టి ధర రూ.199 నుండి రూ.499 వరకు ఉంటుంది.

బ్రెయిడెడ్ హెయిర్ బ్యాండ్
జుట్టు ఫ్రంట్ బ్రెయిడెడ్ స్టైల్ వేసుకోవడానికి ఈ తరం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఇది తమంత తామే వేసుకోవాలంటే కాస్త కష్టమనే చెప్పుకోవాలి. మరి అలా కష్టపడకుండానే చక్కటి ఫ్రంట్ బ్రెయిడెడ్ స్టైల్‌ని సొంతం చేసుకోవాలనుకుంటే ‘బ్రెయిడెడ్ హెయిర్ బ్యాండ్’ అందుకు చక్కటి ఎంపిక. చిత్రంలో చూపించినట్లుగా అల్లిన జుట్టు హెయిర్బ్యాండ్లా ఉంటుందీ టూల్. జుట్టును నీట్‌గా దువ్వుకొని వదిలేయడం లేదంటే మీకు నచ్చిన హెయిర్‌స్టైల్ వేసుకున్నాక.. ముందుభాగంలో ఈ బ్యాండ్‌ని పెట్టేసుకుంటే సరిపోతుంది. అది మీ జుట్టుకు సరికొత్త, ట్రెండీ లుక్‌ని అందిస్తుంది. ఇలా ఎంతో సింపుల్‌గానే ఫ్రంట్ బ్రెయిడెడ్ హెయిర్‌స్టైల్‌ని పొందచ్చు. ఈ బ్యాండ్ కలర్, నాణ్యతని బట్టి ధర రూ.170 నుండి రూ.599 వరకు ఉంటుంది.

జుడా చోటి హెయిర్ ఎక్స్టెన్షన్
అసలే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. చక్కగా అల్లిన పొడవాటి జడలకు పరిమళాలు వెదజల్లే పూల అందాన్ని జత చేసి పెళ్లి కూతురిగా ముస్తాబవ్వాలని కోరుకోని అమ్మాయుంటుందా.. చెప్పండి! కానీ ప్రస్తుతం అంత పొడవాటి జడలు ఉండేవారు చాలా అరుదు. ఒకవేళ సవరం జత చేద్దాంలే అనుకున్నా.. సరిగ్గా వేయడం రాకపోతే అది మధ్యలోనే ఊడిపోయే అవకాశాలే ఎక్కువ. అందుకే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ‘జుడా చోటీ హెయిర్ ఎక్స్టెన్షన్’ని తమ పెళ్లి అలంకరణలో భాగం చేసుకుంటున్నారు.
చిత్రంలో చూపించిన విధంగా పెళ్లికూతురు అలంకరించుకునే పూల జడ ఆకారంలో ఉంటుందిది. అయితే జుట్టుతో అందంగా అల్లిన ఇలాంటి ఫేక్ జడకు పూలు, స్టోన్స్, జడ బిళ్లలు.. ఇలా విభిన్న హంగులద్ది మరీ మార్కెట్లోకి తీసుకొచ్చారు డిజైనర్లు. దీన్ని ధరించాలంటే ముందుగా మీ జుట్టును కొప్పులా ముడి వేసుకోవాలి. దానిపై దీన్ని క్లిప్స్ సహాయంతో తగిలించుకొని చుట్టూ ఊడిపోకుండా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేస్తే సరి. సో.. ఈ జడతో సూపర్బ్ లుక్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ జడ డిజైన్, నాణ్యతని బట్టి ధర రూ.399 నుండి రూ.900 వరకు ఉంటుంది.

ఆర్టిఫిషియల్ హెయిర్ ఎక్స్టెన్షన్
ప్రత్యేకమైన పార్టీలలో మన హెయిర్‌ను కర్ల్స్ చేసుకోవడం కామనే. అయితే ఈ క్రమంలో కర్లర్స్ని వాడడం వల్ల ఆ వేడికి జుట్టు పొడిబారిపోతుంటుంది. అంతేకాదు.. మన జుట్టు పల్చగా, పొట్టిగా ఉండడం వల్ల కర్ల్స్ చేసుకున్నా ఎబ్బెట్టుగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా చక్కటి కర్లీ హెయిర్‌ను పొందాలంటే మీ జుట్టుకు ‘ఆర్టిఫిషియల్ హెయిర్ ఎక్స్టెన్షన్’ను జతచేయాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా వెడల్పాటి సవరంలా ఉంటుందిది. దీన్ని ఎంతో ఈజీగా మీ జుట్టు మధ్యలో దానికి అటాచ్ చేసున్న క్లిప్స్ సహాయంతో అమర్చుకోవచ్చు. అయితే అందుకోసం జుట్టు ముందు భాగంలోని కొంత జుట్టును ముందుకు దువ్వి.. ఈ ఫేక్ జుట్టును అమర్చాలి. ఆపై ముందుకు దువ్విన జుట్టును తిరిగి వెనక్కి దువ్వితే జాలువారే పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది. పైగా ఇలాంటి ఎక్స్టెన్షన్ వల్ల అది ఫేక్ జుట్టేమో అన్న సందేహం కూడా ఎవరికీ కలగదు. సో.. ఈ టూల్ ధరించారంటే పొడవాటి లూజ్ హెయిర్‌తో పార్టీలో అదరగొట్టడానికి మీరు సిద్ధమైనట్లే! ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ నాణ్యత, కలర్‌ని బట్టి ధర రూ.399 నుండి రూ.1200 వరకు ఉంటుంది.
గమనిక: ఇలా మీరు ఎంచుకునే హెయిర్ టూల్ ఏదైనా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్న విషయం మర్చిపోవద్దు.. అలాగే మన జుట్టు రంగుకు సరిపోయేలా వీటిని ఎంచుకుంటే నిజమైన హెయిర్‌స్టైల్స్‌తో అందరినీ మెప్పించచ్చు.. ఏమంటారు??
మగువల అందాన్ని ద్విగుణీకృతం చేసే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.