అప్పటికప్పుడు అనుకొని ఏదైనా పార్టీకి వెళ్లాలన్నా.. ఫంక్షన్‌కి తయారవ్వాలన్నా.. తాత్కాలికంగా మెరుపునందించే ఫేస్‌ప్యాక్‌లు, మాస్కులు వేసుకోవడం కామనే. వాటి కోసం బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి బోలెడంత ఖర్చు పెడుతుంటారు ఈ తరం అమ్మాయిలు. కానీ, ప్రతిసారీ అలా చేయించుకోవడం వల్ల ఎంతో సమయం, డబ్బు వృథా తప్ప దానివల్ల చేకూరే ప్రయోజనం అంతంతమాత్రమే. అలాకాకుండా మనం అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడే తక్కువ ఖర్చుతో ఇన్స్టంట్ గ్లోని సొంతం చేసుకోవాలంటే.. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న ఇన్స్టంట్ బ్యూటీ మాస్కులు ట్రై చేస్తే సరి. పైగా ఇవి అందుబాటు ధరల్లో లభిస్తూ.. మంచి ఫలితాలను కూడా అందిస్తున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మొత్తం ముఖానికే కాదు.. నుదురు, ముక్కు.. ఇలా వివిధ ముఖ భాగాల్లో వేసుకోవడానికి వీలుగా ఏ భాగానికి ఆ భాగం.. అంటూ సెపరేట్‌గా లభిస్తున్నాయి కూడా! సో.. మీ సమస్యకు తగ్గట్టుగా వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ధరించేయచ్చు.. అంతే ఈజీగా తొలగించేయచ్చు. అంతేకాదండోయ్.. ఇవి వేసుకున్న అరగంటలోనే మీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది. మరి అలాంటి కొన్ని ఇన్స్టంట్ ఫేషియల్ మాస్క్‌ల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

గోల్డెన్ కొలాజెన్ ఐ-మాస్క్ షీట్..
ఈ రోజుల్లో కంప్యూటర్స్‌పై నిరంతరాయంగా పనిచేసే వారే ఎక్కువ. ఫలితంగా కళ్లు అలసిపోవడం కామన్. అంతేకాదు.. కళ్లు తేమను కోల్పోయి.. మంట, దురద వంటివి ఎక్కువవుతున్నాయి కూడా! వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ఈ ‘గోల్డెన్ కొలాజెన్ ఐ-మాస్క్ షీట్’ చక్కగా ఉపయోగపడుతుంది. చిత్రంలో చూపించిన విధంగా కళ్లకి మాత్రమే స్టిక్ చేసుకునేలా ఉంటుందీ మాస్క్. దీనిని వేసుకోవడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపై.. ఐ-మాస్క్ షీట్స్ వెనక భాగంలోని స్టిక్కర్‌ని తొలగించి కళ్లపై మాస్క్‌లా ధరిస్తే సరిపోతుంది. అలా 15-20 నిమిషాల పాటు ఉండనిస్తే మీ కళ్లకు సాంత్వన లభిస్తుంది. కళ్ల కింద ఉబ్బడం, నల్లని వలయాలు, అలసిన ఛాయలు.. వంటి వాటి నుండి ఉమశమనం లభిస్తుంది. వీటి నాణ్యత, ప్యాకెట్లో ఉండే సంఖ్యని బట్టి ప్యాకెట్ ధర రూ.49 నుండి రూ.599 వరకు ఉంటుంది.

గోల్డెన్ లిప్ మాస్క్ షీట్..
అధరాలు ఎంతో సున్నితమైనవి. వాతావరణ మార్పులకు తొందరగా ప్రభావానికి గురవుతాయి కూడా. అవి తేమను కోల్పోవడం వల్ల పగుళ్లు ఏర్పడి రక్తం కారడం వంటివీ మనం ఎదుర్కొనే ఉంటాం. అలాకాకుండా అవి ఆరోగ్యంగా కనిపించాలంటే వాటికి సరిపడా పోషణ అవసరం. ఈ క్రమంలో అధరాల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ లిప్ మాస్క్ షీట్’ వాడితే సరిపోతుంది. చిత్రంలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్లో పెదాల ఆకారంలో ఉంటాయివి. వీటి వెనకాల ఉండే స్టిక్కర్‌ని తొలగించి పెదవులపై మాస్క్‌లా అతికించుకుంటే సరిపోతుంది. ఆపై 15 నిమిషాల తర్వాత తొలగిస్తే సరి. తద్వారా మీ అధరాలు తేమను సంతరించుకుని మృదువుగా, సున్నితంగా మారతాయి. అధరాలు అందంగా మెరిసిపోతే ఆ లుక్కే వేరు కదా! మరి మీరూ కూడా ఈ లిప్ మాస్క్‌తో అందంగా మెరిసిపోండి. వీటి నాణ్యత, సంఖ్యని బట్టి ధర రూ.170 నుండి రూ.500 వరకు ఉంటుంది.

గోల్డెన్ ఫోర్‌హెడ్ మాస్క్
పెదాలు, కళ్లు, ముక్కు.. ఇలా మన ముఖంలోని ప్రతి భాగం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుంటాం. కానీ నుదురు భాగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. మరి, ముఖమంతా అందంగా ఉండి నుదురు భాగంలో ముడతలు పడితే అందవికారంగా కనిపిస్తుంది కదా! అందుకోసమే ఈ ‘గోల్డెన్ ఫోర్‌హెడ్ మాస్క్’ అందుబాటులోకొచ్చింది. చిత్రంలో చూపించినట్లుగా కనుబొమ్మల మధ్యభాగం నుండి నుదురు భాగంలో పరుచుకునే విధంగా ఉంటుందీ ఫోర్‌హెడ్ మాస్క్. దీనికి వెనకాల ఉండే స్టిక్కర్‌ని తొలగించి దాన్ని నుదుటి భాగంలో అతికించుకోవాలి. ఆపై ఓ అరగంట తర్వాత తొలగించాలి. అంతే! ఎంతో సింపుల్‌గా నుదుటి భాగంలోని ముడతలకి చెక్ పెట్టవచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల నుదుటి భాగానికి తేమ కూడా లభిస్తుంది. వీటి నాణ్యత, సంఖ్యని బట్టి ధర రూ.150 నుండి రూ.950 వరకు ఉంటుంది.

గోల్డ్ అండర్ ఐ మాస్క్..
10-12 గంటల పని వేళలు, నిద్రలేమి.. వీటన్నింటి వల్ల కళ్ల కింద వాపు, నల్లటి వలయాలు వంటివి ఏర్పడడం సహజం. మరి, వాటి నుండి ఉపశమనం పొందడానికి అమ్మాయిలు చేయని ప్రయత్నమంటూ ఉండదు. మరి ఓసారి ఈ ‘గోల్డ్ అండర్ ఐ మాస్క్’ని కూడా ప్రయత్నించి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. చిత్రంలో చూపించిన విధంగా కళ్ల కింద పెట్టుకోవడానికి వీలైన ఆకారంలో లభిస్తుందీ అండర్ ఐ మాస్క్. వీటి వెనక భాగంలోని స్టిక్కర్స్‌ని తొలగించి కళ్ల కింద మాస్క్‌లా అమర్చుకుంటే సరిపోతుంది. 30 నిమిషాల తర్వాత ఈ మాస్క్‌ని తొలగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత ఫలితం మీరే గమనిస్తారు. ఈ మాస్క్ వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, వాపు.. వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటి నాణ్యత, ప్యాకెట్లో లభించే సంఖ్యని బట్టి ధర రూ.75 నుండి రూ.450 వరకు ఉంటుంది.

గోల్డ్ నోస్ మాస్క్..
ముఖమంతా ఒక ఛాయలో ఉంటూ.. ముక్కు మాత్రం కాస్త నల్లగా ఉండడం.. మనం చాలామందిలో చూస్తూనే ఉంటాం. మరి, ముక్కును కూడా ముఖ ఛాయలో కలిపేయాలంటే ‘గోల్డ్ నోస్ మాస్క్’ ఉపయోగించాల్సిందే! నుదురు, పెదాలు, కళ్ల మాదిరిగానే ముక్కు కోసం కూడా ప్రత్యేకంగా తయారుచేసిన మాస్క్‌లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చాయి. కేవలం ముక్కు భాగానికి మాత్రమే మాస్క్‌లా వేసుకోగలిగే విధంగా ఈ మాస్క్‌ని తీర్చిదిద్దారు. చిత్రంలో చూపించినట్లుగా ఉండే ఈ మాస్క్‌ని వేసుకునే ముందు దాని వెనకాల ఉండే స్టిక్కర్‌ని తొలగించి ముక్కుపై పూతలా పరచుకునేలా అతికించుకుంటే సరిపోతుంది. అలా 15-20 నిమిషాల పాటు ఉండనిచ్చి ఆపై తొలగిస్తే సరి. దీని నాణ్యత, ప్యాకెట్లో లభించే సంఖ్యని బట్టి ధర రూ.150 నుండి రూ.900 వరకు ఉంటుంది.
గమనిక: మాస్క్ అంటే ముఖమంతా వేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖంపై ఏ భాగంలో సమస్య ఉంటే దాన్ని బట్టి ఆయా భాగాల్లో ఈ ఇన్స్టంట్ మాస్కుల్ని ధరిస్తే నిమిషాల్లోనే మెరిసిపోవచ్చు. ముఖంలోని ప్రతి భాగానికి విడిగా, ప్రత్యేకంగా రూపొందించిన ఈ మాస్క్‌ల తయారీలో కొన్ని రకాల సహజసిద్ధమైన పదార్థాలు, విటమిన్లు వాడడం వల్ల తక్షణ మెరుపు మీ సొంతమవుతుంది. అయితే ఇవి ఎంత తక్షణ మెరుపును అందిస్తున్నప్పటికీ, సహజసిద్ధమైన పదార్థాలతో తయారైనప్పటికీ వీటిని ఉపయోగించే ముందు మాత్రం ఓసారి సౌందర్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. తద్వారా కొత్త సమస్యలు పుట్టుకురాకుండా జాగ్రత్తపడచ్చు.
మగువల అందాన్ని రెట్టింపు చేసే ఇలాంటి గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.