ముఖారవిందం అనగానే.. అందరికీ చక్కటి మోము, కలువరేకల్లాంటి కళ్లు, దొండపండులాంటి అధరాలే గుర్తుకొస్తాయి. కేవలం ఇవే కాదు.. అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ‘ముక్కు’ పాత్ర కూడా కీలకమే. అందుకే కవులు సైతం ‘కోటేరు లాంటి ముక్కు’, ‘సంపంగి లాంటి నాసికం’ అంటూ ముక్కు అందాన్ని వర్ణించారు. మరి అంతటి ప్రాముఖ్యం గల ముక్కు చక్కటి ఆకృతిలో ఉన్నప్పుడే మరింత అందంగా మెరిసిపోతాం. అలా ముక్కు తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆశ్చర్యపోతున్నారా? అయితే అలాంటి కొన్ని గ్యాడ్జెట్ల గురించి తెలుసుకోవాల్సిందే!

3డి ఇన్విజిబుల్ నోస్ కరెక్షన్ బ్రిడ్జ్
మనం చాలా లోపాల్ని మేకప్‌తో కవర్ చేస్తుంటాం. అందులో భాగంగా ముక్కును సైతం సన్నగా కనిపించేలా మేకప్ చేసుకోవచ్చు. కానీ ఎంతచేసినా అది తాత్కాలికమే.. మేకప్ తీయగానే అంతా షరా మామూలే.. ముక్కు షేపైతే మారదు కదా! మరి శాశ్వతంగా ముక్కును షార్ప్‌గా కనిపించేలా చేసుకోవాలనుకునే వారికి ఈ ‘3డి ఇన్విజిబుల్ నోస్ కరెక్షన్ బ్రిడ్జ్’ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మీకు అప్పటికప్పుడు నోస్ లిఫ్టింగ్‌కి ఉపయోగపడడమే కాకుండా.. క్రమక్రమంగా ముక్కు షేప్ మారడానికి ఉపకరిస్తుంది. చిత్రంలో చూపించిన విధంగా ఇది అచ్చం ముక్కెర ఆకారంలో ఉంటుంది. కాబట్టి అందరికీ కనిపిస్తుందనే మొహమాటం లేకుండా.. దీన్ని మీరు బయటికి వెళ్లేటప్పుడు కూడా ధరించవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా దీన్ని ముక్కు లోపలికి మెల్లగా చొప్పించుకోవాలి. అంతే! చాలా సింపుల్.. ఇది పెట్టుకున్న తర్వాత ముక్కు లోపలి భాగం కాస్త లాగినట్లుగా అయి.. మీ ముక్కు కొన భాగం చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. కానీ బయటికి మాత్రం మీకు ముక్కెర పెట్టుకున్నట్లుగానే కనిపిస్తుంది. దీని నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 499 నుండి రూ. 2700 వరకు ఉంటుంది.

మ్యాజిక్ నోస్ లిఫ్టింగ్ టూల్
తాత్కాలికంగా నోస్ షేప్ చేసుకోవడం కంటే దానికి శాశ్వత పరిష్కారాన్ని అందించే పరికరాన్ని ఉపయోగించడమే మంచిది. అందుకోసం ఈ ‘మ్యాజిక్ నోస్ లిఫ్టింగ్ టూల్’ బాగా ఉపకరిస్తుంది. చిత్రంలో చూపించిన విధంగా ఇది క్లిప్‌లా ఉంటుంది. దీన్ని ముక్కుపై క్లిప్‌లా అమర్చుకుంటే సరిపోతుంది. అలా అమర్చుకోవడం వల్ల ముక్కు మూసుకుపోకుండా ఈ నోస్ టూల్‌కి రెండువైపులా రంధ్రాలుంటాయి. మీరు ఇంట్లో తీరిగ్గా ఉన్నప్పుడు ప్రతిరోజూ 15-20 నిమిషాల పాటు ఈ గ్యాడ్జెట్‌ని ఉపయోగించడం ద్వారా మీ ముక్కు ఆకారంలో కొద్దికొద్దిగా మార్పు వస్తుంది. దీని నాణ్యతని బట్టి ధర రూ.260 నుండి రూ. 450 వరకు ఉంటుంది.

నోస్ స్లిమ్మింగ్ రోలర్/మసాజర్
ముక్కును సరైన ఆకారంలో తీర్చిదిద్దుకోవడంతో పాటు.. చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గించుకోగలిగితే బాగుంటుంది కదా! అందుకోసమే ఈ ‘నోస్ స్లిమ్మింగ్ రోలర్/మసాజర్’ను రూపొందించారు. చిత్రంలో చూపించిన విధంగా ‘Y’ ఆకృతిలో ఉండి.. పై భాగంలో క్యాప్స్లాగా రెండు మసాజర్స్ ఉంటాయి. కింది భాగాన్ని పట్టుకోవడానికి వీలుగా హ్యండిల్ ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా ఈ మసాజర్‌తో కిందికి, పైకి అనుకుంటూ ముక్కు భాగంలో మసాజ్ చేసుకుంటే కొన్ని రోజుల్లోనే ఆ భాగంలో ఉండే కొవ్వు కరిగిపోయి ముక్కు సన్నగా తయారవుతుంది. అలాగే మసాజ్ వల్ల ఆ భాగంలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ముక్కుపైనే కాకుండా గడ్డం, బుగ్గలు.. తదితర ముఖభాగాల్లో సైతం ఈ మసాజర్ సహాయంతో మసాజ్ చేసుకోవచ్చు. నాణ్యతను బట్టి దీని ధర రూ.110 నుండి రూ.950 వరకు ఉంటుంది.

బ్రీత్ - ఈజీ కోన్స్
కొందరికి నాసికా రంధ్రాలు చిన్నవిగా ఉంటాయి. అందువల్ల ముక్కు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అలా ముక్కు చిన్నగా ఉన్నా మోము అందం దెబ్బతింటుంది. మరి, ముఖ ఆకృతికి నప్పినట్లుగా నాసికా రంధ్రాలను కాస్త పెద్దవి చేసుకొని ముక్కును తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవాలంటే ఈ ‘బ్రీత్-ఈజీ కోన్స్’ బాగా ఉపయోగపడుతాయి. చిత్రంలో చూపించినట్లుగా కోన్ ఆకారంలో ఉండి, దీనికి ఇరువైపులా రెండు రంధ్రాలు ఉంటాయి. ఇప్పుడు దీనిని చిత్రంలో సూచించినట్లుగా ముక్కు లోపలికి పెట్టుకోవాలి. రోజూ ఇలా అమర్చుకోవడం వల్ల ముక్కు రంధ్రాలు క్రమంగా పెద్దవవుతాయి. అంతేకాదు.. వీటికి రంధ్రాలు ఉండటం వల్ల శ్వాస తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. దీన్ని ధరించడం వల్ల ముక్కు కొన షార్ప్‌గా కనిపిస్తుంది.. అలాగే దీనిని పెట్టుకుని పడుకోవడం వల్ల గురక సమస్య కూడా తగ్గుతుందట. మరి మీరూ ఓ ట్రయల్ వేయండి. దీని నాణ్యత, సంఖ్యని బట్టి ధర రూ.400 నుండి రూ.550 వరకు ఉంటుంది.

స్టీల్ నోస్ షేపర్
ముక్కు కింది భాగం మాత్రమే షేప్ మారి పైభాగం లావుగా ఉంటే అందవిహీనంగా కనిపిస్తుంది. అలాకాకుండా ముక్కు మొత్తం చక్కటి ఆకృతిలో షార్ప్‌గా కనిపించాలంటే ముక్కు మొత్తం అమరే క్లిప్ ఉండాల్సిందే! అలాంటిదే ఈ ‘స్టీల్ నోస్ షేపర్’ కూడా! ఫొటోలో చూపించినట్లుగా ఇది చూడడానికి స్టీల్ క్లిప్‌లా ఉంటుంది. ఈ క్లిప్‌కు ఇరువైపులా మధ్యమధ్యలో బొడిపెల్లా ఉంటాయి. ఫొటోలో చూపించినట్లుగా ఈ క్లిప్‌ను ముక్కుపై అమర్చుకుంటే ముక్కుపై ఎత్తుగా ఉన్న చోట కాస్త ఒత్తిడి కలిగి క్రమక్రమంగా ముక్కు ఆకారంలో మార్పు వస్తుంది. ముక్కు షార్ప్‌గా మారేంత వరకు ఈ క్లిప్‌ని రోజూ క్రమం తప్పకుండా ధరిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. దీని నాణ్యతని బట్టి ధర రూ.300 నుండి రూ.699 వరకు ఉంటుంది.
మరి చూశారుగా.. కోటేరు లాంటి సన్నని ముక్కుని పొందాలంటే ఎలాంటి గ్యాడ్జెట్లు ఉపయోగించచ్చో! అయితే ముక్కు లోపలికి పెట్టుకునే పరికరాలను ఉపయోగించేటప్పుడు అవి లోపలికి పోకుండా జాగ్రత్తపడడం, వాటిని ఉపయోగించిన ప్రతిసారీ శుభ్రపరచడం మర్చిపోకండి. ఎందుకంటే వాటిపై చేరిన బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
గమనిక: మగువల అందాన్ని రెట్టింపు చేసే ఇలాంటి గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.
Photos: Amazon.in