
సంప్రదాయమైన చీరల నుండి ట్రెండీ డ్రస్సుల వరకు.. అన్నింటికీ చక్కగా సరిపోయే హెయిర్‌స్టైల్ అంటే ‘బన్’ అని చెప్పచ్చు. డ్రస్‌కు తగ్గట్టుగా సరిపోవడమే కాకుండా.. దీని వల్ల జుట్టు పాడవకుండా ఒద్దిగ్గా ఉంటుంది. మన సెలబ్రిటీలు సైతం వాళ్ల క్యాజువల్ ఔటింగైనా.. పార్టీ అయినా.. రెడ్ కార్పెట్ లుక్కైనా.. వివిధ రకాల బన్ హెయిర్‌స్టైల్స్‌తో మెరిసిపోతుంటారు. అంతేకాదు.. విమానయాన, ఆతిధ్య రంగాలలో పనిచేసే కొంతమంది మహిళలకు బన్ హెయిర్‌స్టైల్ తప్పనిసరి. మరి అటువంటి వాళ్లు ప్రతిరోజూ ఒకే తరహాలో బన్ని వేసుకోవాలంటే రొటీన్‌గా అనిపిస్తుంది. అంతేకాదు.. ఎంత అలవాటు ఉన్న పనైనా అప్పుడప్పుడు వేసుకోవడానికి బద్ధకిస్తాం.. ఒక్కోసారి విసుగొస్తుంది కూడానూ. మరి వారి పనిని సులభం చేసేందుకు, అలాగే రకరకాల స్టైల్స్‌లో బన్ని తీర్చిదిద్దుకునేందుకు మార్కెట్లో వివిధ రకాల గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించి ఎంతో ఈజీగా నిమిషాల్లో బన్ని వేసుకోవచ్చు. మరి అవేంటో.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి..

బ్లాక్ బాండ్ బన్ డోనట్
బన్ హెయిర్‌స్టైల్ వేసుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి. అందులోనూ చక్కగా డోనట్ షేప్‌లో బన్ స్టైల్‌ని చేత్తో వేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలా చక్కని షేప్‌లో బన్ని వేసుకోవాలనుకునే వారికి ఈ ‘బ్లాక్ బాండ్ బన్ డోనట్‘ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడడానికి పొడవాటి బ్యాండ్‌లా ఉండి.. ఇరువైపు అంచులకు రెండు హుక్స్ ఉంటాయి. బన్ వేసుకోవాలనుకునే వారు ముందుగా చక్కగా దువ్వుకుని పోనీ వేసుకోవాలి. తర్వాత చిత్రంలో చూపించిన బన్ డోనట్‌ని పోనీ చివరన ఉంచి.. హెయిర్‌తో పాటు పైవైపుగా రోల్ చేసుకుంటూ రావాలి. ఆపై గుండ్రంగా డోనట్‌లా మడిచి ఆ టూల్ అంచులకు ఉన్న హుక్స్ను అటాచ్ చేయాలి. తర్వాత బన్ మొత్తం సమానంగా పరచుకునేలా సర్దుకోవాలి. అంతే.. ఎంతో అందంగా ఉండే బన్ హెయిర్‌స్టైల్‌లో మీరు సిద్ధమైనట్టే. ఇవి మార్కెట్లో వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. వీటి నాణ్యతను బట్టి రూ.90 నుండి రూ.250 వరకు ఉంటుంది.

ఫ్రెంచ్ ట్విస్ట్ డోనట్ బన్ టూల్
బన్ అంటే.. ఎప్పుడూ గుండ్రంగా మాత్రమే ఉండాలని రూల్ లేదు. వాటిని కూడా వివిధ రకాల ఆకారాల్లో, సైజుల్లో వేసుకోవచ్చు. అంతేకాదు.. కొంత హెయిర్‌ని లూజ్‌గా వదిలేసి మిగిలిన జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో బన్ని వేసుకున్నా కూడా బాగుంటుంది. మరి అలా వేసుకోవాలంటే చాలా టైం కావాలి అనుకుంటున్నారా..! ఇక నుండి డిఫరెంట్ స్టైల్స్‌లో బన్ని చాలా తక్కువ టైంలో వేసుకోవాలనుకునే వాళ్లు ఈ ‘ఫ్రెంచ్ ట్విస్ట్ డోనట్ బన్ టూల్’ని ఉపయోగిస్తే సరి. చిత్రంలో చూపించిన విధంగా ఇది చుట్టిన బెల్ట్‌లా ఉంటుంది. దీన్ని పొడవుగా ఓపెన్ చేస్తే మధ్య భాగం ఓపెన్‌గా ఉంటుంది. దీన్ని ఉపయోగించడానికి ముందు.. జుట్టు మొత్తం లేదా కొంత భాగాన్ని చక్కగా దువ్వి పోనీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బన్ టూల్ మధ్య భాగంలో జుట్టు చివర్లను ఉంచి మెల్లగా పైవైపుగా చుట్టాలి. ఆపై మీకు నచ్చిన ఆకృతిలో ఆ బన్ టూల్‌ని మడిచి వదిలేస్తే చాలు. అది అలా నిలిచి ఉంటుంది. చిత్రంలో చూపించిన విధంగా మీరు వివిధ రకాల ఆకారాల్లో బన్ స్టైల్‌ని వేసుకోవచ్చు. మరి మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి! దీని నాణ్యతని బట్టి ధర రూ.120 నుండి రూ.300 వరకు ఉంటుంది.

డోనట్ బన్ బ్యాండ్
ఇలా చుట్టుకోవడాలు అవీ లేకుండా కేవలం బ్యాండ్ లాంటి దాన్ని ఉపయోగించి బన్ వేసుకోగలిగితే బాగుంటుంది అనిపిస్తోందా! అంతేకాదు.. ఇలా చుట్టడం వల్ల బన్ షేప్ కరక్టుగా రాకపోవచ్చు. మరి అలా అనుకునే వారి కోసమే ఈ ‘డోనట్ బన్ బ్యాండ్’. ఇది చూడడానికి మామూలు బ్యాండ్‌లా ఉంటుంది. ఇది వివిధ సైజుల్లో లభిస్తుంది. మీ జుట్టును బట్టి సైజును ఎంపిక చేసుకోవాలి. ముందుగా చక్కగా దువ్వుకుని పోనీ వేసుకోవాలి. ఆపై ఈ డోనట్ బ్యాండ్‌ని పోనీకి మొదట్లో బ్యాండ్‌లా వేసి.. ఇప్పుడు బన్ బ్యాండ్ మొత్తాన్ని కవర్ చేసుకునేలా జుట్టును సమాంతరంగా పరచుకుని ఓ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన జుట్టును బన్ చుట్టూ చుట్టి ఊడకుండా పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గుండ్రంగా ఉండే బన్స్టైల్తో మీరు అదిరిపోవాల్సిందే! దీని నాణ్యత, బ్యాండ్స్ సంఖ్య, బన్ సైజులను బట్టి ధర రూ.120 నుండి రూ.299 వరకు ఉంటుంది.

రిబ్బన్ బన్ మేకర్ క్లిప్
మనం వేసుకునే బన్ అలా బోసిగా ఉండకుండా ఏ రిబ్బన్తోనో అలంకరిస్తే బాగుంటుంది కదా! బన్ వేసుకుని మళ్లీ దాన్ని రిబ్బన్‌తో స్పెషల్‌గా అలంకరించుకోవాలంటే కాస్త బద్ధకిస్తాం. అలా కాకుండా మనం ఉపయోగించే బన్ క్లిప్కే ఓ రిబ్బన్ కూడా అటాచ్డ్గా ఉంటే చాలా సులభంగా ఉంటుంది కదా. అయితే ఈ ‘రిబ్బన్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్ మేకర్ క్లిప్’ మీ కోసమే. ఇది చూడడానికి పొడవాటి క్లిప్‌లా ఉండి మధ్యలో చీలిక ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు హుక్స్ ఉంటాయి. ఇప్పుడు బన్ హెయిర్‌స్టైల్ కోసం ముందుగా జుట్టును నీట్‌గా దువ్వుకుని పోనీ వేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ బన్ మేకర్ క్లిప్ చీలికలో జుట్టు చివర్లను ఉంచి.. ఇప్పుడు మెల్లగా పైవైపుకి చుట్టుకుంటూ పోవాలి. ఆపై బన్లాగా మడిచి క్లిప్ రెండు అంచుల్లోని హుక్స్‌ని జత చేయాలి. ఆపై చిత్రంలో చూపించిన విధంగా లేదా మీకు నచ్చిన డిజైన్‌లో రిబ్బన్‌ను ముడివేసుకుంటే సరిపోతుంది. దీని నాణ్యత, డిజైన్, ప్యాక్‌లో లభించే సంఖ్యని బట్టి ధర రూ.1600 నుండి రూ.2300 వరకు ఉంటుంది.

స్పైరల్ స్పిన్ స్క్రూ బాబీ పిన్
మెస్సీ బన్.. ఎటువంటి డ్రస్సుకైనా మన సినీ తారలు ఎక్కువగా ఎంచుకునే హెయిర్‌స్టైల్. వీటిల్లోనే వివిధ రకాలుగా తమ కురులను తీర్చిదిద్దుకుంటూ డిఫరెంట్ స్టైల్స్‌తో హొయలుపోతుంటారు మన అందాల తారలు. మరి వారికేమో స్పెషల్ హెయిర్‌స్టైలిస్ట్‌లు ఉంటారు. అలా ఇంట్లో వేసుకోవడం సామాన్యులకి సాధ్యమా అని భావిస్తున్నారా! మరి దాన్ని ఇంట్లో సులభంగా వేసుకోగలిగితే! వావ్ అనిపిస్తోందా! సామాన్యులు సైతం సినీ స్టార్స్‌లా ఇంట్లోనే మెస్సీ బన్ స్టైల్‌ని ఎంతో ఈజీగా వేసుకోవడానికి రూపొందించినదే ఈ ‘స్పైరల్ స్పిన్ స్క్రూ బాబీ పిన్’.
చిత్రంలో చూపించిన విధంగా స్పైరల్ ఆకారంలో ఉంటాయి బాబీ పిన్స్. ఇవి ముఖ్యంగా షార్ట్ హెయిర్‌కు బాగా ఉపయోగపడతాయి. అందుకోసం చిత్రంలో చూపిన విధంగా జుట్టును మెస్సీ బన్‌లా చుట్టుకుని బన్ పైనుండి స్పైరల్ పిన్ని గుచ్చి తిప్పుతూ లోపలికి జరపాలి. అలాగే బన్ కింది భాగం నుండి కూడా ఇంకొక స్పైరల్ బాబీ పిన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ స్పైరల్ డిజైన్ జుట్టును పట్టిఉంచి విడిపోకుండా చేస్తుంది. అలా మనం మెస్సీ బన్ని సైతం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. దీని నాణ్యత, డిజైన్, ప్యాకెట్లో లభించే సంఖ్యని బట్టి రూ.140 నుండి రూ.599 వరకు ఉంటుంది.
గమనిక: మగువల అందాన్ని, సౌందర్య పరిరక్షణలో వారి పనిని సులభతరం చేసే ఇలాంటి బోలెడన్ని బ్యూటీ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసం చదవండి.