
రోజురోజుకీ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో మన చర్మం సహజ తేమను కోల్పోయి పొడిబారడం కామన్. తద్వారా చర్మంపై పగుళ్లు ఏర్పడడం, దురద పుట్టడం.. వంటివి జరుగుతుంటాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. అందుకే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి స్నానం చేసిన వెంటనే, బయటికి వెళ్లే ముందు ఒంటికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మనకు తెలిసిందే. ముఖం నుంచి పాదాల వరకు ఎంతో సులభంగా, శ్రద్ధగా మాయిశ్చరైజర్ రాసుకొనే మనం.. వీపు దగ్గరికొచ్చే సరికి మాత్రం ఏదో అలా కానిచ్చేస్తాం. ఇందుకు మన వీపు మనకు అందకపోవడమూ ఓ కారణమే. ఈ క్రమంలో కొంతమంది ఆపసోపాలు పడి ఎలాగోలా వీపుకు లోషన్ అప్లై చేసుకుంటుంటారు. మీరు కూడా వీపుకు మాయిశ్చరైజర్ రాసుకోవడానికి ఇలాగే కష్టపడుతున్నారా? అయితే ఇకపై మీకా శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే వీపుకు సులభంగా లోషన్ అప్లై చేసుకోవడానికి బోలెడన్ని గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ‘లోషన్ అప్లికేటర్స్’గా పిలిచే వీటిని ఉపయోగించి ఇటు వీపుతో పాటు అటు ఇతర శరీర భాగాలకు సైతం సులభంగా మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. మరి అలాంటి కొన్ని లోషన్ అప్లికేటర్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

ఫోల్డబుల్ లోషన్ అప్లికేటర్
మన శరీరంలోని అన్ని భాగాలకు మన చేతులతోనే ఈజీగా లోషన్‌ని రాసుకోవచ్చు. కానీ వీపు విషయానికొచ్చే సరికి మాత్రం చేతులతో అందినంత వరకు మాత్రమే పైపైనే లోషన్ రాసుకుంటాం. ఇకపై అలాకాకుండా వీపు మొత్తానికి చక్కగా పరచుకునేలా మాయిశ్చరైజర్ రాసుకోవాలంటే ‘ఫోల్డబుల్ లోషన్ అప్లికేటర్’ని ఉపయోగించండి. చిత్రంలో చూపించినట్లుగా ఇది చూడడానికి అచ్చం సెల్ఫీ స్టిక్‌లా ఉంటుంది. అలాగే మడతపెట్టడానికి వీలుగా కూడా ఉంటుందిది. దీని పైభాగంలో ఉన్న మృదువైన స్పాంజిపై కొద్దిగా లోషన్ వేసి ఫొటోలో చూపించినట్లుగా మన వీపుకు రాసుకోవాలి. ఇది ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సినంత పొడవుకు అడ్జెస్ట్ చేసుకుంటూ దీన్ని ఉపయోగించవచ్చు. దీని నాణ్యతను బట్టి ధర రూ. 1,400 నుండి రూ. 3,000 వరకు ఉంటుంది.

ఎర్గానమిక్ లోషన్ అప్లికేటర్
ఇతర శరీర భాగాల్లాగే వీపుకు కూడా చేత్తో మాయిశ్చరైజర్ రాసుకున్న ఫీలింగ్ రావాలనుకునే వారూ లేకపోలేదు. అలాంటి వారి కోసమే ఈ ‘ఎర్గానమిక్ లోషన్ అప్లికేటర్’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేసింది. ఫొటోలో చూపించినట్లుగా ఇది అచ్చం మన అరచేయి ఆకారంలో ఉండి దానికి పైవైపున ఒక హ్యాండిల్ స్టిక్ అమరి ఉంటుంది. ఇప్పుడు ఈ టూల్ అరచేయిపై మనకు కావాల్సినంత లోషన్ వేసుకొని వీపుకు మృదువుగా మర్దన చేసుకుంటే సరిపోతుంది. ఈ టూల్ చేతి ఆకారంలో ఉన్న భాగం చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి వీపుపై సుతారంగా, సున్నితంగా మసాజ్ చేసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. అంతేకాదు.. ఇలా నెమ్మదిగా, మృదువుగా రుద్దుకోవడం వల్ల లోషన్ కూడా చర్మంలోకి చక్కగా ఇంకుతుంది. ఈ టూల్ నాణ్యతను బట్టి దీని ధర రూ. 300 నుండి రూ. 700 వరకు ఉంటుంది.

రోల్ ఈజీ లోషన్ అప్లికేటర్
ఓవైపు వీపుకు లోషన్ అప్లై చేసుకోవడంతో పాటు మరోవైపు వీపుకు చక్కగా మసాజ్ చేయగలిగే గ్యాడ్జెట్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ ‘రోల్ ఈజీ లోషన్ అప్లికేటర్’ మీకోసమే. దీంతో ఏకకాలంలోనే వీపుకు మాయిశ్చరైజర్ రాసుకోవడంతో పాటు మసాజ్‌ని కూడా అందించచ్చు. చిత్రంలో చూపినట్లుగా ఇది ఒక స్టిక్ లాగా ఉంటుంది. పైవైపున మూడు విభిన్న రోలర్స్ అటాచ్ చేసుకునే అమరిక ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా రెండు రోలర్స్ మాదిరిగా, మరొకటి గుండ్రంగా, ఫ్లాట్‌గా ఉంటాయివి. మనం కావాల్సిన రోలర్‌ను స్టిక్కు అమర్చుకొని దానిపై లోషన్ వేసి వీపుకు రాసుకోవడమే తరువాయి. రోలర్స్ మాదిరిగా ఉండే వాటితో వీపుపై ఎత్తుపల్లాలున్న దగ్గర మాయిశ్చరైజర్‌ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే గుండ్రంగా, వెడల్పుగా ఉండే రోలర్‌తో వెడల్పుగా ఉండే వీపు భాగాల్లో అటు లోషన్ రాసుకుంటూనే ఇటు మసాజ్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంది కదూ ఈ గ్యాడ్జెట్! మరి మీరూ ఓసారి ట్రై చేయండి! ఈ టూల్ నాణ్యతను బట్టి దీని ధర రూ. 400 నుండి రూ. 2,500 వరకు ఉంటుంది.

బ్యాక్ బ్లిస్ లోషన్, క్రీమ్ అప్లికేటర్
వీపుపై సుతారంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో గ్యాడ్జెట్ ‘బ్యాక్ బ్లిస్ లోషన్, క్రీమ్ అప్లికేటర్’. ఫొటోలో చూపించినట్లుగా ఒక వెడల్పాటి స్టిక్‌లా ఉండి.. దానికి పైవైపున కాస్త పొడవు, వెడల్పుగా ఉండే మృదువైన స్పాంజి అమరి ఉంటుంది. ఈ స్పాంజిపై లోషన్ వేసి.. దాంతో వీపుకు అప్లై చేసుకుంటే సరి. కాసేపు అలాగే రుద్దడం వల్ల మాయిశ్చరైజర్ చర్మంలోకి చక్కగా ఇంకిపోతుంది. అలాగే ఈ టూల్‌కి అమరి ఉన్న స్పాంజిని ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేసుకోవచ్చు. అది ఆరాక తిరిగి స్టిక్కు అమర్చుకోవచ్చు. ఒకవేళ స్పాంజి పాడైపోతే ఈ టూల్ మొత్తం పక్కన పెట్టక్కర్లేదు.. కొత్త స్పాంజిని స్టిక్కు జతచేస్తే మళ్లీ ఈ గ్యాడ్జెట్‌ను ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు. ఈ టూల్ నాణ్యతని బట్టి దీని ధర రూ. 1,300 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది.

టాపికల్ లోషన్ అప్లికేటర్
క్రీమ్, లోషన్లతో పాటు జెల్ తరహా మాయిశ్చరైజర్‌ని మీ వీపుకు అప్లై చేయగలిగే గ్యాడ్జెట్ కావాలనుకుంటున్నారా! అయితే అందుకు ‘టాపికల్ లోషన్ అప్లికేటర్’ సరైన ఎంపిక. ఫొటోలో చూపించినట్లుగా కింది వైపు స్టిక్ ఉండి.. పైవైపున అచ్చం పెయిన్ కిల్లర్ రోల్-ఆన్లా ఉంటుందీ గ్యాడ్జెట్. ఈ రోల్-ఆన్ భాగాన్ని మూతతో కవర్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోల్-ఆన్ వెనకున్న మూత తీసి.. మనం రాసుకోవాలనుకుంటున్న జెల్ లేదా లోషన్‌ను అందులో నింపి మూత బిగించేయాలి. ఫొటోలో చూపించినట్లుగా ఈ టూల్‌తో మీ వీపుపై రాసుకున్న కొద్దీ రోల్-ఆన్ గుండ్రంగా తిరుగుతూ.. లోషన్ బయటికి వస్తూ వీపుపై సమానంగా పరచుకుంటుంది. అలా కాసేపు రాయడం వల్ల వీపు చర్మంలోకి మాయిశ్చరైజర్ చక్కగా ఇంకుతుంది. ఈ టూల్‌ని ఉపయోగించి వీపుకు మాయిశ్చరైజర్ రాసుకోవడం భలే ఈజీగా ఉంది కదూ!! ఈ టూల్ నాణ్యతను బట్టి ధర రూ. 1,700 నుండి రూ. 2,700 వరకు ఉంటుంది.
గమనిక : వీపుకు మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఇక మా పనైపోయిందిలే అని వాటిని అలాగే పక్కన పడేయకుండా చక్కగా శుభ్రం చేయడం మాత్రం మరిచిపోకండి. ముఖ్యంగా ఈ గ్యాడ్జెట్లకు అనుసంధానమై ఉన్న స్పాంజిల్లో బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువ. దాంతో అవి వీపుపైకి చేరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ లోషన్ అప్లకేటర్ ఉపయోగించినా.. దాని ప్యాకెట్ లేబుల్‌పై దాన్నెలా శుభ్రం చేసుకోవాలి అనే సూచనలుంటాయి. వాటిని పాటించి ఈ టూల్స్‌ని పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి.
గమనిక: మగువల అందాన్ని, సౌందర్య సంరక్షణలో వారి పనిని మరింత సులభతరం చేసే ఇలాంటి మరెన్నో బ్యూటీ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.