
చర్మంపై వచ్చే పింపుల్స్, ముడతలు.. వంటివన్నీ కాలంతో సంబంధం లేకుండా అమ్మాయిలను కలవరపెట్టే సమస్యలు. అయితే ఇవి రాకుండా ఉండడానికి, వస్తే వీటి నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు మగువలు. ఇదిలా ఉంటే.. ఈ సమస్యలతో పాటు మన కంటికి కనిపించకుండా మనల్ని వేధించే అతిపెద్ద సౌందర్య సమస్య ‘బ్లాక్‌హెడ్స్’. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి మన చర్మ రంధ్రాల్లో చేరి కొన్నాళ్లకు బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. తద్వారా చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. మరి, వీటిని తొలగించుకోవడానికి పార్లర్లకు క్యూ కట్టే వారు కొందరైతే.. సహజసిద్ధమైన చిట్కాలను పాటించేవారు మరికొందరు. ఇవన్నీ చేసినా ఫలితం కనిపించదు. ఇకపై ఇలాంటి అదనపు ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా ఈ ‘బ్లాక్‌హెడ్స్’కి చెక్ పెట్టచ్చు. అది కూడా మార్కెట్లో లభ్యమవుతోన్న వివిధ రకాల గ్యాడ్జెట్స్ ఉపయోగించి! మరి, బ్లాక్‌హెడ్స్‌కి బై బై చెప్పే అలాంటి కొన్ని టూల్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

సిలికాన్ నోస్ పోర్ క్లీనర్..
ఈ కాలుష్యానికి ఎక్కువగా ప్రభావానికి గురయ్యేది ముఖమే. మనం ప్రతిరోజు ఫేష్వాష్తో ముఖం కడుక్కుంటూనే ఉన్నా కూడా దాని వల్ల శుభ్రం అయ్యేది చర్మం పైపై భాగమే! కాబట్టి ముఖాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో మనం చేతితో ఎంతగా రుద్దినా ఫలితం ఉండదు. కాబట్టి చర్మ రంధ్రాలు లోలోపలి నుంచి శుభ్రపడాలంటే దాని కోసం ప్రత్యేకంగా రూపొందించిన టూల్‌ని వాడకతప్పదు. ముఖాన్ని శుభ్రం చేయాలంటే అందుకు ఎంచుకునే టూల్ అరచేతిలో ఇమిడేంత చిన్నదిగా, పట్టుకోవడానికి అనువుగాను ఉండాలి. అందుకోసమే ఈ ‘సిలికాన్ నోస్ పోర్ క్లీనర్’ రూపొందింది. ఇది మురికితో పాటు బ్లాక్‌హెడ్స్‌ను కూడా తొలగిస్తుంది. పై చిత్రంలో చూపిన విధంగా ఇది నీటి బొట్టు ఆకారంలో ఉంటుంది. దీనికి వెనక వైపు పట్టుకోవడానికి చిన్న హ్యాండిల్ కూడా ఉంటుంది. ఈ టూల్‌తో పాటు చిన్నగా, గుండ్రంగా ఉండే మృదువైన స్క్రబ్బర్ కూడా లభిస్తుంది. ముందుగా ముఖాన్ని నీటిలో శుభ్రం చేసుకుని ఆపై ఫొటోలో చూపించినట్లుగా ఈ టూల్‌తో ముఖంపై మృదువుగా, నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇక చిన్న స్క్రబ్బర్ టూల్‌తో ముక్కు చివర్లు, కనుబొమ్మలు.. వంటి భాగాల్లో సులభంగా రుద్దుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు లోపలి నుండి శుభ్రపడతాయి. ఈ విధంగా రెండు రోజులకోసారి చేయడం వల్ల ముఖంపై దుమ్ము చేరదు. నాణ్యతను బట్టి వీటి ధర రూ. 150 నుండి రూ.399 వరకు ఉంటుంది.

చార్కోల్ నోస్ స్ట్రిప్స్..
అర్జెంటుగా పార్టీకి హాజరవ్వాలా? అయితే బ్లాక్‌హెడ్స్ వల్ల ఇబ్బందిపడుతున్నారా! కానీ వాటిని తొలగించుకోవడానికి స్క్రబ్, ఫేషియల్ చేసుకునే సమయం లేదా! ఏం పర్లేదు.. ఈ ‘చార్కోల్ నోస్ స్ట్రిప్స్’ ఉపయోగిస్తే సరి. చాలామందికి ముక్కుపై బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారికి ఈ నోస్ స్ట్రిప్ చక్కగా పనిచేస్తుంది. ఫొటోలో చూపిన విధంగా ఇవి ముక్కుపై అతికించుకునేందుకు వీలైన ఆకారంలో కట్ చేసినట్లుగా ఉంటుంది. ఈ స్ట్రిప్ వెనకవైపు ఉన్న స్టిక్కర్‌ని తొలగించి ఫొటోలో చూపించినట్లుగా అతికిస్తే సరి.. అలా 15-20 నిమిషాలపాటు ఉంచుకుని నెమ్మదిగా దాన్ని తొలగించుకోవాలి. అంతే.. ఇలా క్రమంగా చేయడం వల్ల కొన్నాళ్లకు ముక్కుపై ఉండే బ్లాక్‌హెడ్స్ ఇట్టే మటుమాయమవుతాయి. ఎంతో సింపుల్‌గా ఉంది కదూ ఈ టూల్! వీటి నాణ్యత, ప్యాకెట్లో లభించే స్ట్రిప్స్ సంఖ్యను బట్టి వాటి ధర రూ.70 నుండి రూ.600 వరకు ఉంటుంది.

బ్లాక్‌హెడ్ వ్యాక్యూమ్ సక్షన్..
చర్మరంధ్రాల్లో పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తొలగించడం కోసం అమ్మాయిలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అవెంత చేసినా చర్మం లోపలి నుండి శుభ్రపడాలంటే కేవలం స్క్రబ్‌తో మాత్రమే సాధ్యం కాదు. అందుకోసం ‘బ్లాక్‌హెడ్ వ్యాక్యూమ్ సక్షన్’ బాగా ఉపయోగపడుతుంది. చిత్రంలో చూపించిన విధంగా ఇది రేజర్లా ఉంటుంది. దీనికి నాలుగు రకాల మూతలు ఉంటాయి. మీకు కావాల్సిన విధంగా ఒక్కో మూతను మార్చుకుని మీరు మీ ముఖాన్ని శుభ్రపరచుకోవచ్చు. ముందుగా ఓ వెడల్పాటి గిన్నెలో వేడి నీటిని తీసుకుని వాటితో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా చర్మ రంధ్రాలు తెరుచుకుని శుభ్రం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మూతల్ని మార్చుకుంటూ ఫొటోలో చూపించినట్లుగా టూల్ మధ్యభాగంలో ఉండే బటన్ని నొక్కుతూ ముఖమంతా గుండ్రంగా రుద్దుకోవాలి. ఫలితంగా ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్‌తో పాటు మృతచర్మం కూడా తొలగిపోతుంది. దీని ధర నాణ్యతను బట్టి రూ.400 నుండి రూ.700 వరకు ఉంటుంది.

బ్లాక్‌హెడ్ రిమూవర్ ట్వీజర్ కిట్..
ఇలాంటి టూల్స్‌ని మనం ఎక్కువగా బ్యూటీపార్లర్‌లో ఫేషియల్ చేసే సమయంలో చూసుంటాం. వీటిని మనం ఉపయోగించగలమా అనుకోకండి. వాటిని ఉపయోగించాల్సిన సరైన పద్ధతి తెలిస్తే మనం ఈజీగా వాడుకోవచ్చు. సాధారణంగా బుగ్గలు, నుదురు, గడ్డం.. వంటి ముఖభాగాల్లో వచ్చే పింపుల్స్‌ని మనం చేతులతో గిల్లి సమస్యను ఇంకా పెద్దది చేస్తాం. ఇక నుండి అలాంటిపనులు చేయడం మానుకోండి. దానికోసం ‘బ్లాక్‌హెడ్ రిమూవర్ ట్వీజర్ కిట్’ని ఉపయోగించండి. పై చిత్రంలో చూపించినట్లు ఇవి 3 లేదా 5 టూల్స్ కలిపి ఒక కిట్‌గా ఉంటుంది. ఫొటోలో చూపించినట్లుగా ఇవి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేయడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ జరగదు. ఇందులో సూదిలా ఉన్న టూల్‌ని గమనించారా! దానిలోని పదునైన భాగంతో పింపుల్‌పై మెల్లగా గుచ్చాలి. ఆ తర్వాత ఈ టూల్ వెనక భాగంలో ఉండే రంధ్రం లాంటి దానితో ఆ పింపుల్ చుట్టూ ఒత్తాలి. ఆపై శుభ్రమైన బట్టతో తుడిచేయాలి. అలా చేసిన తర్వాత కూడా పింపుల్ ఇంకా అలాగే ఉంటే మనకు చూపించిన దానిలో ఫ్లకర్ ఆకారాల్లో ఉన్న వాటితో చర్మం రంధ్రంలోంచి బ్లాక్హెడ్ని బయటకు లాగేయాలి. ఇలా ముఖంపై ఉండే పింపుల్స్ దగ్గర్నుంచి బ్లాక్‌హెడ్స్ వరకు ఇంట్లోనే సులభంగా తొలగించుకోవచ్చు. ఈ టూల్ కిట్ నాణ్యతను బట్టి రూ.400 నుండి రూ.2500 వరకు ఉంటుంది.

ఫేషియల్ బ్లాక్‌హెడ్ రిమూవింగ్ స్పాచులా..
ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్‌ని తొలగించుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో టూల్ ‘ఫేషియల్ బ్లాక్‌హెడ్ రిమూవింగ్ స్ప్యాచులా’. పైన చిత్రంలో చూపించిన విధంగా ఇది అచ్చం రేజర్లా ఉంటుంది. అలాగని వంగినట్లుగా ఉన్న దీని కొన భాగం వల్ల ఎటువంటి హాని కలగదు. ఇది అంత పదునుగా కూడా ఉండదు. దీన్ని ముందుగా ఛార్జింగ్ చేసి ఆపై దీని మధ్య భాగంలో ఉండే స్టార్ట్ బటన్ని నొక్కి ముఖంపై కాస్త మృదువుగా ప్రెస్ చేస్తూ షేవ్ చేస్తున్నట్లుగా ముందుకు, వెనక్కి.. పైకి, కిందికి అనాలి. అంతే.. ఇలా క్రమంగా ఈ టూల్‌ని ఉపయోగిస్తే త్వరలోనే బ్లాక్‌హెడ్స్‌ని తొలగించుకోవచ్చు. అలాగే ఈ టూల్ కొన భాగం వెనుక వైపుతో ముఖంపై సుతారంగా మాయిశ్చరైజర్‌ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ టూల్ నాణ్యతని బట్టి ధర రూ.1200 నుండి రూ.3000 దాకా ఉంటుంది.
ఇవే కాకుండా బ్లాక్‌హెడ్స్ తొలగించడానికి మార్కెట్లో వివిధ రకాల గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లైతే ఈ టూల్స్ వాడడం కంటే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తేనే సత్వర పరిష్కారం దొరుకుతుంది.
మగువల అందాన్ని, సౌందర్య సంరక్షణలో వారి పనిని మరింత సులభతరం చేసే ఇలాంటివి ఎన్నో రకాల బ్యూటీ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం ‘బ్యూటీ గ్యాడ్జెట్స్’ శీర్షికలో ప్రచురితమయ్యే ప్రత్యేక కథనాన్ని చదవండి.
Photos: Amazon.in