
పండగలు, పెళ్లిళ్లు, పార్టీలు.. ఇలా వేడుకేదైనా దానికి తగ్గ ఫ్యాషనబుల్ దుస్తులు ధరించడానికే మొగ్గుచూపుతున్నారు నేటి తరం అమ్మాయిలు. అక్కడితో సరిపెట్టుకోకుండా.. తాము ధరించే దుస్తులకు నప్పే హెయిర్‌స్టైల్‌తో తమ లుక్‌ని పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో బన్, ట్విస్టెడ్ బ్రెయిడ్, ఫ్రెంచ్ ఫ్లాట్.. వంటి విభిన్న హెయిర్‌స్టైల్స్‌ని వేసుకొని మరింత అందంగా మెరిసిపోతున్నారు. అయితే ఇలాంటి డిఫరెంట్ హెయిర్‌స్టైల్స్ కోసం పార్లర్లను ఆశ్రయించేవారు కొందరైతే.. ఇరుగు-పొరుగు, ఫ్రెండ్స్ సహాయం తీసుకునేవారు మరికొందరు. కొన్ని హెయిర్‌స్టైల్స్ అయితే ఎవరికి వారు సొంతంగా వేసుకోవడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఇకపై అలా కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎలాంటి హెయిర్స్టైల్నైనా ఎవరికి వారే సులభంగా వేసుకునేందుకు ప్రస్తుతం బోలెడన్ని హెయిర్ యాక్సెసరీస్ మార్కెట్లో కొలువుదీరాయి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలిస్తే చాలు.. ఇతరుల ప్రమేయం లేకుండా మీకు మీరే సులభంగా ఎలాంటి హెయిర్‌స్టైల్ అయినా వేసుకోవచ్చు. మరి, హెయిర్‌స్టైల్ వేసుకోవడాన్ని ఎంతో ఈజీ చేసేసిన అలాంటి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

ట్విస్ట్ బన్ రబ్బర్ క్లిప్
ట్రెడిషనల్ దగ్గర్నుంచి మోడ్రన్ అవుట్‌ఫిట్స్ దాకా ఎలాంటి డ్రస్పైనైనా నప్పే హెయిర్‌స్టైల్స్‌లో బన్ హెయిర్‌స్టైల్ ఒకటి. అయితే దీన్ని వేసుకోవడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ సిగలాగే ఉంటుంది కదా అని అలాగే ముడిచేస్తే కాసేపటికే వదులైపోయి.. బన్ వూడిపోతుంది. మరి, అలా జరగకుండా బన్ హెయిర్‌స్టైల్ చక్కగా కుదరాలన్నా, ఎక్కువ సేపు చెక్కుచెదరకుండా ఉండాలన్నా ‘ట్విస్ట్ బన్ రబ్బర్ క్లిప్’ను ఉపయోగించాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా ఒక పొడవాటి క్లిప్‌లా ఉండే దీనికి మధ్యలో చీలిక ఉంటుంది. ఇరువైపులా రెండు హుక్స్ ఉంటాయి. ఇప్పుడు బన్ హెయిర్‌స్టైల్ కోసం ఫొటోలో చూపించినట్లుగా ఒక్కో స్టెప్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందు జుట్టును నీట్‌గా దువ్వి పోనీ వేసుకోవాలి. ఆపై ఆఖర్లో కాస్త హెయిర్ వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ట్విస్ట్ బన్ రబ్బర్ క్లిప్ చీలికలో జుట్టు చివర్లను ఉంచి.. గుండ్రంగా పైవైపుగా చుట్టుకుంటూ రావాలి. ఆపై రౌండ్‌గా మలిచి రెండు హుక్స్‌ని ఒక దాంట్లో ఒకటి తొడిగేయాలి. ఆపై బన్ మొత్తాన్నీ సమానంగా పరచుకునేలా సర్దుకోవాలి. అంతే.. చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే బన్ హెయిర్‌స్టైల్ వేసుకోవడం పూర్తయిపోయినట్లే. ఈ రబ్బర్ క్లిప్‌తో ఎలాంటి బన్ హెయిర్‌స్టైల్ అయినా ఇట్టే వేసేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో లభ్యమవుతోన్న ఈ రబ్బర్ క్లిప్స్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 79 నుంచి రూ. 247 వరకు ఉంది.

ఫ్రెంచ్ హెయిర్ బ్రెయిడ్ టూల్..
ఫ్రెంచ్ ఫ్లాట్.. ఈ హెయిర్‌స్టైల్‌ని ఇష్టపడని అమ్మాయి ఉండదంటే అది అతిశయోక్తి కాదు. అయితే దీన్ని ఎవరికి వారు వేసుకోవడమంటే కాస్త కష్టమైన పనే. అలాగని ప్రతిసారీ పార్లర్లకు వెళ్లడమో లేదంటే ఇతరుల సహాయం తీసుకోవడమో చేయలేము. అందుకే మీకు మీరే ఈజీగా ఈ హెయిర్‌స్టైల్ వేసుకోవాలనుకుంటున్నారా? అయితే ‘ఫ్రెంచ్ హెయిర్ బ్రెయిడ్ టూల్’ని ఉపయోగిస్తే సరి. ఫొటోలో చూపించినట్లుగా మెలికలు తిరిగిన పాములాగా ఉంటుందీ టూల్. ఈ యాక్సెసరీ మొదట్లో, ఆఖర్లో రెండు హుక్స్ ఉంటాయి. అవి జడ వదులుకాకుండా బిగుతుగా, చెక్కుచెదరకుండా ఉండేందుకు తోడ్పడతాయి. ముందుగా జుట్టును నీట్‌గా వెనక్కి దువ్వి.. మీరు ఎంత పైనుంచి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ టూల్‌ని ఉంచాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి ఒక పాయ తీసుకొని ఫొటోలో చూపించినట్లుగా ఒక రంధ్రంలో నుంచి తీయాలి. ఆపై మరోవైపు నుంచి మరో పాయ తీసి దాని కింద ఉండే రంధ్రంలో నుంచి తీయాలి. ఇలా కింది దాకా చేసుకుంటూ వచ్చి ఆపై జడ అల్లేసుకోవాలి. ఇలా ఈ టూల్ ఉపయోగించడం వల్ల ఈ హెయిర్‌స్టైల్ నీట్‌గా వస్తుంది. అలాగే బిగుతుగా ఉండి.. ఎక్కువ సమయం వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇలా మనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్లాట్ హెయిర్‌స్టైల్‌ను ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ బ్రెయిడ్ టూల్ నాణ్యతను బట్టి ధర రూ. 99 నుంచి రూ. 339 వరకు ఉంది.

హెయిర్ స్టైలింగ్ ట్విస్ట్ క్లిప్..
సింపుల్‌గా ఉంటూనే అందంగా కనిపించాలనుకునే వారు ఎంచుకునే హెయిర్‌స్టైల్స్‌లో ట్విస్టెడ్ తరహా హెయిర్‌స్టైల్స్ ఒకటి. అయితే వీటిని వేసుకునే క్రమంలో అక్కడక్కడా చిన్న చిన్న పాయల్ని తీయాల్సి ఉంటుంది. ఇవి సమాన దూరాల్లో రాకపోతే లుక్ ఎబ్బెట్టుగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా శ్రమ పడకుండా ఈజీగా ఈ హెయిర్‌స్టైల్ వేసుకోవాలంటే ‘హెయిర్ స్టైలింగ్ ట్విస్ట్ క్లిప్’ ఉపయోగిస్తే సరి. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం హెయిర్బ్యాండ్లా ఉంటుందీ క్లిప్. అయితే దానిపైన సమాన దూరాల్లో చిన్న చిన్న ఫ్లకర్స్లా ఉంటాయి. ముందుగా జుట్టును నీట్‌గా వెనక్కి దువ్వి ఈ హెయిర్‌బ్యాండ్ పెట్టేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఫ్లకర్స్ ఉన్నాయో అక్కడ జుట్టును చిన్న చిన్న పాయలుగా తీస్తూ ఫ్లకర్స్తో బంధించేస్తే సరిపోతుంది.. చూడ్డానికి సింపుల్ అండ్ స్వీట్‌గా ఉండే ఈ హెయిర్‌స్టైల్‌ని ట్విస్ట్ క్లిప్‌తో వేసుకోవడం ఎంతో ఈజీగా ఉంది కదూ!! కేవలం ముందు భాగంలోని హెయిర్‌నే కాకుండా ఒక వైపు లేదంటే ఇరువైపులా వేర్వేరుగా ట్విస్ట్ హెయిర్‌స్టైల్ వేసుకోవాలనుకుంటే అందుకోసం విడివిడిగా బ్రెయిడర్ టూల్ క్లిప్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 173 నుంచి రూ. 449 వరకు ఉంది.

ఫ్రెంచ్ బన్ మేకర్ టూల్..
లాంగ్ గౌన్స్, ఫ్రాక్స్.. వంటి మోడ్రన్ డ్రస్సులపైకి చక్కగా నప్పుతుంది ఫ్రెంచ్ బన్ హెయిర్‌స్టైల్. మన లుక్‌ని ఇనుమడింపజేసే ఈ హెయిర్‌స్టైల్ చూడ్డానికి సింపుల్‌గానే ఉంటుంది.. కానీ వేసుకోవడం మాత్రం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. ‘ఫ్రెంచ్ బన్ మేకర్ టూల్’ ఉపయోగిస్తే ఎంతో ఈజీగా ఈ హెయిర్‌స్టైల్‌ని వేసేసుకోవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా రెండువైపులా తెరచి ఉన్న అమ్ముల పొదిలా ఉంటుందీ టూల్. ముందుగా జుట్టును నీట్‌గా వెనక్కి దువ్వి.. చివర్లను ఈ టూల్‌కి చుట్టేయాలి. దాన్ని నెమ్మదిగా పైవైపుకు చుట్టుకుంటూ రావాలి. క్షితిజ సమాంతరంగా చుడుతూ తల వద్దకొచ్చాక మాత్రం ఈ టూల్‌ని పొడవుగా అంటే లంబంగా తిప్పి, మరోసారి చుట్టి బాబీ పిన్స్ పెట్టేయాలి. అంతే.. ఎంతో సింపుల్‌గా వేసుకునే ఈ హెయిర్‌స్టైల్ చూడ్డానికి మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. ఈ ఫ్రెంచ్ బన్ మేకర్ టూల్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి ఆకృతి, డిజైన్‌ను బట్టి ధర రూ. 249 నుంచి రూ. 399 వరకు ఉంది.

వాల్యూమ్ బూస్ట్ కోంబ్ స్టిక్..
అటు స్టైల్‌గా కనిపించడానికి, ఇటు జుట్టు ఎక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేయడానికి ప్రస్తుతం విభిన్న రకాల హెయిర్ యాక్సెసరీస్‌ని ఉపయోగిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. ‘వాల్యూమ్ బూస్ట్ కోంబ్ స్టిక్’ కూడా అలాంటిదే! ఫొటోలో చూపించినట్లుగా కాస్త కర్వీగా ఉండే దీనికి కింది భాగంలో క్లిప్పుల్లాంటి అమరిక ఉంటుంది. ఫొటోలో మాదిరిగా ఈ టూల్‌ని ముందు భాగంలో లేదంటే వెనుక భాగంలో.. ఇలా మీకు కావాల్సిన చోట జుట్టు లోపల అమర్చుకొని పోనీ లేదంటే ఇతర హెయిర్‌స్టైల్స్ వేసేసుకోవచ్చు. తద్వారా అటు స్టైల్‌గా కనిపించడంతో పాటు జుట్టు బాగా ఉన్నట్లుగా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా ఈ టూల్ సహాయంతో సింపుల్ హెయిర్‌స్టైల్స్ వేసుకొని ట్రెండీగా మెరిసిపోవచ్చు. ఈ కోంబ్ స్టిక్ డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 151 నుంచి రూ. 269 వరకు ఉంది.
మగువల అందాన్ని, సౌందర్య పరిరక్షణలో వారి పనిని మరింత సులభతరం చేసే ఇలాంటి బోలెడన్ని బ్యూటీ గ్యాడ్జెట్ల గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం అందించే అప్డేట్స్ని మిస్ కాకుండా చదవండి.