కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం.. వంటి పలు కారణాల వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకొని ఆయా భాగాలు లావెక్కడం కామనే. ఈ ప్రభావం ముఖంపై కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. బుగ్గలు లావెక్కడం, డబుల్ చిన్ రావడం.. వంటివీ అందులో భాగమే. అయితే బుగ్గలు కాస్త చబ్బీగా ఉన్నా మనం అంతగా పట్టించుకోం.. కానీ డబుల్ చిన్ వస్తే మాత్రం తెగ ఇబ్బంది పడిపోతుంటాం. ఎందుకంటే అది మనల్ని అందవిహీనంగా కనిపించేలా చేస్తుందనేదే అందుకు ప్రధాన కారణం. మరి, దీన్ని తగ్గించుకోవడానికి ఎన్ని క్రీమ్‌లు వాడినా సరైన ఫలితం కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలి.. అని ఆలోచిస్తున్నారా? సింపుల్.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల్లో లభిస్తోన్న డబుల్ చిన్ రెడ్యూసింగ్ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తే సరి. తరచూ వీటిని ఉపయోగించడం వల్ల త్వరలోనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొంది.. అందంగా మెరిసిపోవచ్చు. మరి, డబుల్ చిన్ మటుమాయం చేసే అలాంటి కొన్ని గ్యాడ్జెట్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

డబుల్ చిన్ రిడక్షన్ మాస్క్
సాధారణంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి లేదంటే డెలివరీ తర్వాత పొట్ట భాగాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి వెయిస్ట్ బెల్టు ధరించడం మనకు తెలిసిందే. మరి అలాంటి బెల్టు సహాయంతోనే డబుల్ చిన్ను కూడా దూరం చేసుకోవచ్చంటే మీరు నమ్ముతారా? అయితే ఈ బెల్టు అంత పెద్దగా కాకుండా మాస్క్ రూపంలో ఉంటుంది. అదే ‘డబుల్ చిన్ రిడక్షన్ మాస్క్’.
ఫొటోలో చూపించినట్లుగా సాగేలా ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఈ బెల్టును ఇలా మెడల కింది నుంచి పైవైపుకి కాస్త గట్టిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్ తగ్గే కొద్దీ ఇంకాస్త బిగ్గరగా బిగిస్తుండాలి. ఫలితంగా కొద్ది రోజుల్లోనే డబుల్ చిన్ మటుమాయమై ఆ భాగం సాధారణంగా మారుతుంది. ఈ మాస్క్ బుగ్గలపై కూడా కవరవుతుంది కాబట్టి.. అవి కూడా స్లిమ్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి మాస్కులు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో లభ్యమవుతున్నాయి. డిజైన్, నాణ్యతను బట్టి దాని ధర రూ. 363 నుంచి రూ. 599 వరకు ఉంది.

హ్యాండ్‌హెల్డ్ మసాజర్
శరీరంలో ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి మసాజ్ టూల్స్‌ని ఉపయోగించే వారు నానాటికీ పెరిగిపోతున్నారు. డబుల్ చిన్ని తగ్గించుకోవడానికి కూడా ఇలాంటి మసాజర్ టూల్ ఒకటి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫొటోలో చూపించినట్లుగా ఒక హ్యాండిల్ ఉండి.. దానికి ముందు భాగంలో గుండ్రటి అమరిక ఉంటుంది. అందులో మృతకణాల్ని తొలగించడానికి, మసాజ్ కోసం.. ఇలా విభిన్న రకాల హెడ్స్‌ని అమర్చుకునే వీలుంటుంది. మసాజ్ హెడ్‌ని ఈ టూల్‌కి అమర్చుకొని ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్ చేసి.. స్విచ్ ఆన్ చేస్తే అది గుండ్రంగా తిరుగుతుంది. అయితే దాని హ్యాండిల్‌పై ఉండే బటన్ని తిప్పడం ద్వారా ఈ హెడ్ తిరిగే వేగాన్ని అదుపుచేయచ్చు. మనకు కావాల్సినంత వేగాన్ని సెట్ చేసుకొని ఆ హెడ్‌తో చిన్‌పై మసాజ్ చేస్తే అక్కడ పేరుకున్న అదనపు కొవ్వు కరిగిపోవడంతో పాటు రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే దీంతో ఇతర శరీర భాగాల్లో కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మసాజర్స్లో కరెంట్‌తోనే కాకుండా ప్రస్తుతం బ్యాటరీతో నడిచేవి కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వాటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 759 నుంచి రూ. 1,699 వరకు ఉంది.

ఫేస్‌లిఫ్ట్ నెక్ మసాజర్
ముఖానికి రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి, అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి, ముఖ భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించడానికి ఫేషియల్ ఎక్సర్సైజ్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ క్రమంలో డబుల్ చిన్ను తగ్గించడానికి మీతో వ్యాయామం చేయించడానికి వచ్చేసింది ‘ఫేస్‌లిఫ్ట్ నెక్ మసాజర్’.
ఫొటోలో చూపించినట్లుగా హ్యాండ్ శానిటైజర్ బాటిల్లా ఉండే ఈ టూల్‌కి పైభాగంలో ఉండే బటన్ కిందికి, పైకి కదిలేలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే దీనిలోపల స్ప్రింగ్స్ అమరి ఉంటాయి. దీన్ని ఫొటోలో చూపించినట్లుగా ఛాతీకి, చిన్‌కి మధ్యన ఫిక్స్ చేసి.. నోటిని పెద్దగా తెరవడం, మూయడం లేదంటే మెడను వంచడం, పైకి లేపడం.. ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల గడ్డానికి చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా అక్కడి కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు.. ఆ భాగానికి రక్తప్రసరణ కూడా అందుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల డబుల్ చిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ టూల్ నాణ్యతను బట్టి ధర రూ. 207 నుంచి రూ. 373 వరకు ఉంది.

వైబ్రేటింగ్ హీటింగ్ మసాజ్ బ్యూటీ డివైజ్
శరీరంలో అక్కడక్కడా పేరుకున్న కొవ్వును తొలగించుకోవడానికి కొన్ని వైబ్రేటింగ్ డివైజ్‌లు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటిదే ఈ ‘వైబ్రేటింగ్ హీటింగ్ మసాజ్ బ్యూటీ డివైజ్’ కూడా! ఫొటోలో చూపించినట్లుగా ఒక హ్యాండిల్ ఉండి దానికి పైభాగంలో కాస్త కర్వీగా, రంధ్రంలాగా ఉండే అమరికను మనం గమనించచ్చు. బ్యాటరీతో ఛార్జ్ చేసుకునే వీలున్న ఈ పరికరానికి హ్యాండిల్ వద్ద ఉన్న బటన్ని నొక్కగానే కర్వీగా ఉండే భాగం నుంచి ఎల్ఈడీ లైట్, కాస్త వేడి ఉత్పత్తవడంతో పాటు వైబ్రేట్ అవుతుంటుంది. దీన్ని చిన్ వద్ద ఉంచి లోపలి నుంచి బయటి దిశగా (అప్‌వర్డ్ డైరెక్షన్లో) మసాజ్ చేయాలి. తద్వారా దీన్నుంచి వెలువడే వేడి, వైబ్రేషన్ కారణంగా ఆ భాగానికి చక్కటి మసాజ్ అందడంతో పాటు రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. తద్వారా డబుల్ చిన్ సమస్య నుంచి సత్వర ఉపశమనం పొందచ్చు. ఈ టూల్ సహాయంతో బుగ్గలు, మెడ.. వంటి ప్రదేశాల్లో సైతం మసాజ్ చేసుకోవచ్చు. దీని ఆకృతి, నాణ్యతను బట్టి ధర రూ. 8,054నుంచి రూ. 10,520వరకు ఉంది.

డబుల్ చిన్ రెడ్యూసర్ ప్యాడ్
డబుల్ చిన్ను తగ్గించుకోవడానికి మాకు కరెంట్‌తో నడిచే పరికరాలేవీ వద్దు.. సింపుల్‌గా ఉండే డివైజ్ ఏదైనా ఉంటే చెప్పండి అంటారా..? అయితే అందుకు ‘డబుల్ చిన్ రెడ్యూసర్ ప్యాడ్’ చక్కటి ఎంపిక. ఫొటోలో చూపించినట్లుగా లవ్ సింబల్ హెడ్‌తో కూడిన మృదువైన స్టిక్‌లా, పైవైపు కాస్త ఎత్తుగా ఉంటుందీ ప్యాడ్. ఆ ఎత్తుగా ఉండే భాగాన్ని చిన్కు తాకిస్తూ లోపలి నుంచి బయటి వైపు (అప్‌వర్డ్ డైరెక్షన్లో) మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా రోజుకో అరగంట చొప్పున తరచూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చక్కటి ఫలితాన్ని పొందచ్చు. ఈ ప్రక్రియ వల్ల గడ్డం భాగంలో పేరుకున్న కొవ్వు కరగడంతో పాటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా డబుల్ చిన్ నుంచి విముక్తి పొందచ్చు. ఇలా డబుల్ చిన్ తగ్గించుకునే ప్రక్రియను ఎంతో ఈజీ చేసేసిన ఈ టూల్ సహాయంతో నుదురు, బుగ్గలు, మెడ.. వంటి ప్రాంతాల్లో కూడా మసాజ్ చేసుకోవచ్చు. దీని నాణ్యతను బట్టి ధర రూ. 1,498గా ఉంది.
గమనిక: శరీరంలోని ఏ ప్రాంతంలో అయినా సరే.. కొవ్వు తగ్గాలంటే అందుకు సరైన ఆహారం, వ్యాయామాలే చక్కటి పరిష్కారం. ఇలాంటి గ్యాడ్జెట్ల పాత్ర వాటి తర్వాతే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కొవ్వుని తగ్గించుకోవడానికి ముందు ఆహారం, వ్యాయామాలకే ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే ఇలాంటి గ్యాడ్జెట్ల వాడకం విషయంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా సంబంధిత నిపుణులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
మగువల అందాన్ని, సౌందర్య పరిరక్షణలో వారి పనిని మరింత సులభతరం చేసే ఇలాంటి బోలెడన్ని బ్యూటీ గ్యాడ్జెట్ల గురించి తెలుసుకోవాలంటే www.vasundhara.net లో ప్రతి శుక్రవారం అందించే అప్డేట్స్ని మిస్ కాకుండా చదవండి.
Photos: Amazon.in