సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))

హాయ్‌ మేడం. నేను గత కొన్ని రోజుల నుంచి నీటి బుడగలతో బాధపడుతున్నా. ఫలితంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, చుండ్రు, అవాంఛిత రోమాలు మొదలైన సమస్యల్ని ఎదుర్కొంటున్నా. నేనొక సాధారణ ఉద్యోగిని. 8 గంటల పాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఎన్ని కసరత్తులు చేసినా నా బరువు అదుపు కావట్లేదు. అలాగే నెలసరి కూడా సరిగ్గా రావట్లేదు. నాకు త్వరలోనే పెళ్లి. ఈ సమస్యల వల్ల పెళ్లయ్యాక ఇబ్బందులొస్తాయేమోనని భయంగా ఉంది. ఏం చేయను?


మీరు చెబుతున్న లక్షణాలన్నీ కూడా పీసీఓఎస్‌ ఉన్న స్త్రీలలో సర్వసాధారణం. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం కూడా సహజం. పీసీఓఎస్‌కి మెడికల్‌ ట్రీట్‌మెంట్‌తో పాటుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గాలి అన్న అవగాహన మీకు ఉన్నందు వల్ల ఆహారపు నియమాలు పాటిస్తూ.. మీకున్న సమయంలోనే మీరు చేయగలిన వ్యాయామాలు చేసి బరువు తగ్గడం మాత్రం తప్పనిసరి. పీసీఓఎస్‌ అదుపులోకి రాకపోతే పెళ్లి తర్వాత కూడా గర్భం నిలవడం కష్టమవుతుంది. అందుకని మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స మొదలుపెట్టండి. నిజం చెప్పాలంటే పీసీఓఎస్‌ చికిత్స అనేది అన్ని కోణాల నుంచి జరగాలి. అంటే గైనకాలజిస్ట్‌తో పాటు న్యూట్రిషనిస్ట్‌, ఫిజియో థెరపిస్ట్‌, డెర్మటాలజిస్ట్‌, ఎండోక్రైనాలజిస్ట్‌.. వీరందరి సలహాలు కూడా అవసరమవుతాయి.


Know More

మేడం.. నాకు గర్భాశయం (Uterus) ఒక వైపు ఉంది.. అది కూడా చిన్నగా ఉంది. డాక్టర్‌ని అడిగితే యునికార్నేట్‌ యుటరస్‌ అని చెప్పారు. నేను ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా. రెండు నెలల్లో అబార్షన్‌ అయింది. రెండోసారి ఐవీఎఫ్‌ చేయించుకోవాలనుకుంటున్నా. నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా? చెప్పగలరు.


యునికార్నేట్‌ యుటరస్‌ అనేది పుట్టుకతో వచ్చే ఒక లోపం. గర్భాశయం ఒక సగం మాత్రమే పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్న వాళ్లకి ఒక మూత్రపిండం కూడా ఉండకపోవచ్చు. ఇటువంటి యుటరస్‌ ఉన్నప్పుడు పిల్లలు పుట్టకపోవడం, గర్భస్రావాలు, నెలలు నిండకుండానే కాన్పు కావడం, బిడ్డ ఎదుగుదలలో లోపాలు.. వంటివన్నీ చాలా తరచుగా కనిపిస్తాయి. మీకు ఒకసారి ఐవీఎఫ్‌తో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి రెండోసారి కూడా రావచ్చు. కానీ యునికార్నేట్‌ యుటరస్‌తో తొమ్మిది నెలలు నిండటం చాలా అరుదు. మీకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ ఇందులో ఉన్న సాధకబాధకాలు మీకు వివరంగా చెప్పగలుగుతారు.


Know More

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 25. ఎత్తు 5’4’’. బరువు 68 కిలోలు. గత రెండేళ్ల నుంచి నేను PCOS (Bilateral) తో బాధపడుతున్నా. దీని పరిణామాలేంటో చెప్పండి. అలాగే నేను బరువు తగ్గాలంటే పాటించాల్సిన ఆహార నియమాలేంటి? - ఓ సోదరి


మీరు పీసీఓఎస్‌తో బాధపడుతున్నానని రాశారు.. కానీ మీకు ఎటువంటి లక్షణాలున్నాయో రాయలేదు. పీసీఓఎస్‌ అనేది ఒక మల్టీఫ్యాక్టోరియల్‌ డిసీజ్‌.. అంటే అనేక కారణాల వల్ల కలిగే ఒక వ్యాధి. అలాగే దీని లక్షణాలు కూడా రకరకాలుగా ఉంటాయి. మీకు చికిత్స చేయాలంటే మీరు ముఖ్యంగా ఏ లక్షణంతో బాధపడుతున్నారో తెలియాలి. నెలసరి సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరగడం, మొహమ్మీద-మెడ మీద మొటిమలు రావడం, పిల్లలు పుట్టకపోవడం.. మొదలైనవి దీని వల్ల కలిగే లక్షణాలు. మీకు ఇంకా పెళ్లి కాలేదు.. నెలసరి సరిగ్గా రావాలి అనుకుంటే ఒక రకం చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మీకు పెళ్లైంది.. కానీ పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే ఇంకో రకం చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా మీరు అనుకున్నట్లుగానే బరువు తగ్గడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే మీకు జీవనశైలి గురించి, బరువు తగ్గడానికి పాటించాల్సిన చిట్కాల గురించి సూచిస్తూ.. మీ లక్షణాలను కూడా విశ్లేషించి చూసి దానికి తగిన చికిత్స అందిస్తారు.


Know More

నమస్తే డాక్టర్‌. పెళ్లయ్యాక పిల్లలు పుట్టకపోతే చేయించుకునే వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో నొప్పి తెలియకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్‌ పాటించాలి? అలాగే నార్మల్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో Cervix, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌, ఎండోమెట్రియం థిక్‌నెస్‌ని కచ్చితంగా తెలుసుకోవడం వీలవుతుందా?- ఓ సోదరి


వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ అనేది పెళ్లైన లేదా కలయికలో పాల్గొంటున్న స్త్రీలకు మాత్రమే చేస్తారు. ట్రాన్స్‌ వెజైనల్‌ ప్రోబ్‌ చాలా సన్నగా ఉంటుంది. అందుకని దీనివల్ల నొప్పి కలిగే అవకాశం లేదు. అలాగే ఇది వాడేటప్పుడు జెల్‌ వాడతారు కాబట్టి రాపిడి అనేది ఉండదు. ఇంకా మీకు నొప్పి తెలియకుండా ఉండాలంటే మీరు శారీరకంగా, మానసికంగా రిలాక్స్‌ అవడం ముఖ్యం. కండరాలు బిగబట్టకుండా వదులుగా ఉంచితే నొప్పి ఉండదు. నార్మల్‌ స్కాన్‌లో ఎండోమెట్రియం థిక్‌నెస్‌ కచ్చితంగా తెలుస్తుంది. కానీ ఈ స్కాన్‌ ద్వారా ఫెలోపియన్‌ ట్యూబ్స్‌, సర్విక్స్‌ వివరాలు తెలుసుకోవడం మాత్రం కష్టం.


Know More

నా వయసు 25. నెలసరికి అయిదు రోజుల ముందు నుంచి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నా. ఈ మధ్య పీిరియడ్స్‌ రాకుండా ఉండేందుకు పదిరోజుల పాటు మాత్రలు వాడాను. వాడిన రెండు నెలల తరువాత... పది రోజుల ముందుగానే నెలసరి వచ్చేస్తుంది. ఇదేమైనా సమస్యా? - ఓ సోదరి


మీ ఉత్తరంలో నెలసరి ముందు వచ్చే కడుపునొప్పి ఎన్ని నెలల నుంచి వస్తుందో చెప్పలేదు. పీరియడ్స్‌ ముందు వచ్చే కడుపునొప్పిని కంజెస్టివ్‌ డిస్మెనోరియా అంటారు. కటివలయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటేనే ఇలాంటి నొప్పి వస్తుంది. పీఐడీ (పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటివ్‌ డిసీజ్‌), ఫైబ్రాయిడ్స్‌, ఎండోమెట్రియాసిస్‌.. వంటి అనారోగ్య సమస్యలుంటే ఇలాంటి నొప్పి రావొచ్చు. మీరు ముందు గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ట్రాన్స్‌ వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌, మరికొన్ని రకాల రక్తపరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కారణం కనుక్కోవడం కష్టం. మీరు చెప్పిన రెండో సమస్య పీరియడ్స్‌ రాకుండా మాత్రలు వాడటం.. ఇలా చేస్తే సహజసిద్ధమైన రుతుక్రమంలో తేడాలొస్తాయి. అవి తిరిగి సర్దుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఇలా మాత్రలు వాడటం ఆరోగ్యానికి మంచిదికాదు. దానివల్ల కొన్నిసార్లు ప్రాణాంతక సమస్యలూ రావొచ్చు.


Know More

హాయ్‌ మేడం. నా వయసు 27. పెళ్లై రెండున్నరేళ్లవుతోంది. మేం ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు థైరాయిడ్‌ వంటి సమస్యలేవీ లేవు. నా భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ కాస్త తక్కువుంది అన్నారు. నేను త్వరగా గర్భం ధరించాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి


మీ భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువుంది అని అన్నారు. మీ పరీక్షల వివరాలు, మీ భర్త పరీక్షల వివరాలు అన్నీ తెలియకుండా సలహా ఇవ్వడం కష్టం. ఆయనను ఒకసారి ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించమని చెప్పండి. కౌంట్‌ తక్కువ ఉండడానికి కారణమేంటో తెలుసుకొని.. పెరగడానికేమైనా మందులు వాడాల్సి ఉంటే వారు సూచిస్తారు. స్పెర్మ్‌ కౌంట్‌, కదలిక రెండూ తక్కువగా ఉంటే ఐయూఐ ద్వారా గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


Know More

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 29. నాకు ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం వాడికి ఫీడింగ్‌ ఇస్తున్నా. నాకు పిరియడ్స్‌ కూడా రెగ్యులర్‌గానే వస్తాయి. కానీ మొన్నామధ్య జెల్లీలా డిశ్చార్జి అయింది. అలా ఎందుకు అయిందో తెలియట్లేదు. దానివల్ల ఏదైనా సమస్య ఉంటుందా? తెలుపగలరు. - ఓ సోదరి


జెల్లీ వంటి డిశ్చార్జి మీకు ఏ సమయంలో అయిందో చెప్పలేదు. దాంతో పాటు మీకు దురద, మంట, దుర్వాసన ఉంటే గనుక తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించుకోవాలి. అటువంటివేమీ లేకపోతే.. నెలసరికి ముందు, అండం విడుదలయ్యే సమయంలో, కలయిక తర్వాత ఇటువంటి డిశ్చార్జి సహజంగా కనిపించచ్చు. ఒకవేళ ఇది తరచూ రిపీట్‌ అయితే గనుక డాక్టర్‌కి చూపించుకోవడం మంచిది.


Know More

హలో మేడం. నాకు యునికార్నేట్‌ యుటరస్‌ (Unicornuate Uterus) సమస్య ఉంది. దీనికి పరిష్కారమేంటి?


యునికార్నేట్‌ యుటరస్‌ అనేది గర్భాశయానికి సంబంధించిన ఒక సమస్య. ఇది పుట్టుకతోనే వచ్చే లోపం. ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భాశయం రెండు భాగాలుగా మొదలై.. ఆ రెండు భాగాల మధ్య గోడ కరిగిపోవడంతో ఒకటిగా తయారవుతుంది. కొందరిలో గర్భాశయం ఒకవైపు మాత్రమే తయారైతే దాన్ని యునికార్నేట్‌ యుటరస్‌ అంటారు. దీనివల్ల గర్భం ధరించడంలోనూ, నెలలు నిండి కాన్పు కావడంలోనూ సమస్యలు రావచ్చు. అలాగే చాలాసార్లు మూత్రపిండం కూడా ఒకవైపు మాత్రమే ఉండచ్చు. అందుకే మీరు దాని గురించి కూడా పరీక్ష చేయించుకోవాలి. పెళ్లయ్యే వరకు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎవరైనా గైనకాలజిస్ట్‌ని సంప్రదించి దీనివల్ల మీకు రాబోయే ఇబ్బందుల గురించి ముందే తెలుసుకోవడం మంచిది.


Know More