సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

ఆ విషయాన్ని మా ఆయనకు ఎలా చెప్పాలి?

నమస్తే మేడమ్‌. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. నేను, నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో స్వదేశానికి రాబోతున్నాం. మా దాంపత్య జీవితం బాగానే ఉంది.. కానీ మావారి అక్క వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త తన అక్క గురించి ఏ మాట చెప్పినా ఊరుకోడు. ఆమె మా ఇంట్లో ఒక్క రోజుంటే చాలు.. ఆ రోజంతా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆమెకు పెళ్లై పదేళ్లవుతుంది. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయన కూడా ఆమె చెప్పినదానికల్లా తలూపుతారు. మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మా వారి అక్క కూతురు ఫోన్లో ఏమడిగినా అప్పటికప్పుడు కొనివ్వాల్సిందే. మా ఆయన ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో కూడా మా ఆడపడుచే చెబుతుంది. ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగం పేరు చెప్పి దూరంగా ఉంటున్నాం. అయినా మా పుట్టింటి వారు నాకు ఇచ్చే స్థలం గురించి అడిగి వేధిస్తున్నారు. త్వరలో స్వదేశానికి వస్తున్నాం అని తెలిసి.. అది తీసుకురా, ఇది తీసుకురా అంటూ ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. మేము మా పిల్లల కోసం కొంత మొత్తాన్ని దాచి.. మిగతాది తక్కువ బడ్జెట్లో వారు అడిగినవి కొనిద్దామనుకుంటున్నాం. కానీ వాళ్ల గొంతెమ్మ కోరికలు నా బిడ్డల భవిష్యత్తుకి ఆటంకమవుతాయేమోనని భయం పట్టుకుంది. మా వారికి డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెట్టడం ముందునుంచీ అలవాటు. దూరంగా వచ్చాక ఆ అలవాటు కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్లీ తాను అదే పద్ధతిని అనుసరిస్తే మా కష్టార్జితం గంగపాలవడం ఖాయం. దీని గురించి మా వారికి సున్నితంగా వివరించే మార్గం సూచించగలరు. - ఓ సోదరి


డా|| పద్మజ

సైకాలజిస్ట్

మీరు విదేశాల్లో ఉండగానే ఆర్థిక ప్రణాళికలు వేసుకొని, పొదుపు అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు.. మీ సంపాదనలో ఒక భాగం పిల్లల భవిష్యత్తు కోసం, ఒక భాగం కుటుంబ అవసరాల కోసం, ఒక భాగం మీ ఇద్దరి వ్యక్తిగత అవసరాల కోసం, ఒక భాగం కుటుంబ పొదుపు - స్థిరాస్తుల కొనుగోలు కోసం, ఒక భాగం మీ భర్త కుటుంబ సభ్యుల కోసం.. ఇలా మీ సంపాదనను కొన్ని భాగాలుగా విభజించుకొని కేటాయించుకోండి. అలాగే ఇద్దరూ పని చేస్తున్నారు కాబట్టి ఖర్చుల విషయంలో ఇద్దరికీ స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇద్దరి ఖర్చుల విషయంలో ఒక పరస్పర అంగీకారానికి రావడం మంచిది.

పైన చెప్పిన విధంగా మీరిద్దరూ కలిసి కొంత మొత్తాన్ని, విడివిడిగా కొంత డబ్బును ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటే.. రేపు పిల్లల భవిష్యత్తు ఎలాగా? అనే దిగులుండదు. అలాగే మీకంటూ ఒక ఇల్లు కానీ, పొదుపు కానీ, ఏదైనా స్థిరాస్థి కోసం తీసి ఉంచుతారు కాబట్టి.. మీకూ భవిష్యత్తు గురించి భయాలు ఉండవు. అలాగే మీ సంపాదనలో కొంతమేరకు కుటుంబం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించుకున్నప్పుడు నువ్వెందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవ్వదు.

ఇకపోతే మీ పుట్టింటి వారు మీకు ఇవ్వాల్సిన ఆస్తి గురించి అంటారా? మీ భర్తతో మీకు సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు వాళ్లు ఇచ్చే ఆస్తుల గురించి మూడో వ్యక్తి కల్పించుకోలేని వాతావరణాన్ని మీరిద్దరూ ఏర్పరచుకోండి. మీ పుట్టింటి వారు మీకిచ్చే విషయంలో గానీ, వాళ్ల దగ్గర్నుంచి మీరు తీసుకునే విషయంలో గానీ.. మీ భర్త తరపు వాళ్లు కల్పించుకోకుండా మీ భర్త మీకు అండగా నిలబడగలడేమో ప్రయత్నం చేసి చూడండి. మీరు అతన్ని నమ్మి.. అతను కూడా మిమ్మల్ని నమ్మితే మూడో వ్యక్తి మిమ్మల్ని కష్టపెట్టే విధంగా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అలాగే చిన్న చిన్న విషయాల్లో మీ భర్త తరపు వారు చెప్పే విషయాలు విన్నా.. జీవితంలో ముఖ్యమైన విషయాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకునేట్టుగా అవగాహనా సాన్నిహిత్యాన్ని పెంచుకోండి.

ఇక మీ భర్త అక్క విషయానికి వస్తే.. అతను ఆమెకి ఏ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం చేసుకోండి. ఆమె పరిణతితో కూడిన సలహాలు ఇస్తోందా? ఆమె సలహాలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడ్డాయా? ఇన్నేళ్ల సాన్నిహిత్యాన్ని పెళ్లవగానే దూరం చేసుకుంటే మిమ్మల్ని తప్పుబడతారన్న ఆలోచన అతనికుందా? వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఎంత దృఢంగా ఉంది?.. వంటి విషయాలన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంటుందో.. అక్కాతమ్ముళ్లుగా వాళ్ల మధ్య అనుబంధం కూడా అలాగే ఉంటుందని అర్థం చేసుకోండి. పైన చెప్పినట్టుగానే మీ వ్యక్తిగత విషయాల్లోకి మూడో వ్యక్తి తలదూర్చలేనంతగా మీ బంధాన్ని దృఢపరచుకోండి. అలాగే మీరు కూడా మీ భర్త తరపు వారికి అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టినప్పుడు అతనికి కూడా మీపై విశ్వాసం పెరుగుతుంది. వాళ్లు అడిగే వాటిలో సాధ్యం కానివి వదిలిపెట్టి.. మీ శక్తికి తగినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేట్టుగా ప్లాన్‌ చేసుకోండి.
Post Your Comment Here

(Press ctrl+g to switch(English/Telugu))

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))