సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

అలా అయితే నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిందేనా?

నమస్తే మేడం.. నా వయసు 33 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు నాకు ఏడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. ఏదైనా సంబంధం వచ్చి మాకు ఏమాత్రం నచ్చకపోతే వాళ్లు నన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నారు. ఒకవేళ ‘సంబంధం బాగుంది.. కొన్ని విషయాలు సర్దుకుపోవచ్చులే..’ అనుకుంటే మాత్రం వాళ్లు నన్ను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. మాకు నచ్చకపోవడం అంటే నేను కానీ, నా తల్లిదండ్రులు కానీ ఏ విషయంలోనూ(చదువు, ఉద్యోగం, కుటుంబం.. వంటి విషయాల్లో) సర్దుకుపోలేమన్నమాట! అలా ఉంటున్నాయి నేను ఇష్టపడని, నన్ను ఇష్టపడే సంబంధాలు. ఇదే పరిస్థితి ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఏదైనా సంబంధం వచ్చి నేను అబ్బాయిని ఇష్టపడ్డానంటే.. వాళ్లు నన్ను చేసుకోరని ముందే అర్థమవుతోంది. దాంతో చాలా నిరాశగా ఉంటుంది. అలా అని ఇష్టం లేని అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి? అలా ఇష్టం లేకుండా కొంతవరకు ముందుకు వెళ్లి, ఆ తర్వాత వదులుకున్న సంబంధాలు కూడా ఉన్నాయి. పెళ్లిచూపుల్లో అబ్బాయిని ఇష్టపడి సంతోషంగా పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జీవితానికి లేదేమో అనిపిస్తోంది. సమస్య ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. నాకు నచ్చని వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండిపోతానేమోనని భయంగా ఉంది. నన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్లనే నేను చేసుకోవాలని నా మనసుకి ఎలా సర్దిచెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో.. ఏం చేయాలో తెలియట్లేదు.. దయచేసి సలహా చెప్పండి. - ఓ సోదరి


డా|| పద్మజ

సైకాలజిస్ట్

ఏ సంబంధమైనా ఒకవైపు పూర్తి అనుకూలత ఉండి, మరోవైపు సంతృప్తి లేనప్పుడు.. అలాంటి సంబంధాలు కుదరడమనేది సాధ్యం కాదన్న విషయం వాస్తవమే. అయితే మీ విషయంలో.. మీ ప్రాధాన్యతలేంటి? వాటిలో అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చే అంశాలేంటి? కొంతవరకు ప్రాధాన్యత ఇచ్చినా సర్దుకుపోగల విషయాలేంటి? వంటి అంశాలను ఒక పట్టికలాగా తయారుచేసుకోండి. ఇలా మీరు కావాలనుకున్న లక్షణాలు ఏ సంబంధానికైతే అధికంగా కలుస్తు్న్నాయో వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టండి.

marriage7yearsghg650-1.jpg

మామూలుగా ఏదో సంబంధం వచ్చింది కదా? అని వెంటనే చూపులు ఏర్పాటు చేసుకొని.. అవతలి వారు నచ్చిందని, ఆ తర్వాత మీరు అతని గురించి విచారించి నచ్చలేదని చెప్పడం కంటే.. ముందే అతని గురించి, అతని కుటుంబ నేపథ్యం.. వంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాతే వాళ్లు మీకు నచ్చడం, మీరు వాళ్లకి నచ్చడం, పరస్పరం చూసుకునే దాకా ఆ సంబంధాన్ని తీసుకురావచ్చేమో ఆలోచించండి.

అయితే కొన్ని సందర్భాల్లో మనకు సాధారణంగా అనిపించినవి.. అవతలి వారు సాధారణం కంటే తక్కువ స్థాయిలోనో.. ఎక్కువ స్థాయిలోనో చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రాధాన్యతలన్నింటినీ వాళ్లు సంతృప్తిపరచలేకపోయినా మీ ముఖ్యమైన ప్రాధాన్యతలకు ఎంతవరకు దగ్గరగా వస్తున్నారనేది కూడా ఆలోచించుకోండి. ఏడు సంవత్సరాల నుంచి సంబంధాలు చూసినా కుదరడం లేదు.. కాబట్టి జీవితంలో పెళ్లే కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు, మీ వ్యక్తిత్వానికి తగిన గౌరవం ఇచ్చి, మిమ్మల్ని మీరుగా ఇష్టపడే వ్యక్తి తారసపడరని అనుకోకండి. కాకపోతే సంబంధాలు చూడడం కంటే, తగిన సంబంధాలు, భావసారూప్యత, కలకాలం కలిసి ఉండే కుటుంబాల నుంచి వచ్చే అబ్బాయిని చూస్తున్నారా? లేదా? అనేది ముందే ఆలోచించండి.

ఏడేళ్ల నుంచి మీరు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఈ పాటికి మీకు కొన్ని అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మీ ఆకాంక్షలు, ప్రాధాన్యతలు.. అవతలి వ్యక్తి స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయా? ఆచరణాత్మకంగా ఉన్నాయా? అనే కోణంలో కూడా పరిశీలించుకోండి. అలాగే మీకున్నట్టుగానే అవతలి వారికీ కొన్ని కోరికలు, ప్రాధాన్యతలుంటాయని తెలుసుకోండి. అయితే వాటికి మీరు ఎంతవరకు సరిపోయేట్టుగా ఉన్నారో ముందే ఆలోచించుకొని చూపుల దాకా వెళ్లడం మంచిది.
Post Your Comment Here

(Press ctrl+g to switch(English/Telugu))

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))