సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

ఆ వ్యసనం నుంచి ఆయన్నెలా బయటకి తీసుకురావాలి?

మేడమ్‌.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్‌ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు అతనిని నీకు ‘దూమపానం, మద్యపానం.. వంటి అలవాట్లున్నాయా?’ అనడిగితే ‘లేవు’ అన్నారు. కానీ ఇప్పుడు తాగి ఆఫీసుకి కూడా సరిగా వెళ్లడం లేదు. నెలలో వారం, పది రోజులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అనడిగితే ఆర్థిక సమస్యలు, ఒత్తిడితో అలా తాగుతున్నానని అంటున్నాడు. వాళ్ల పెద్దవాళ్లకి చెబితే ‘పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవు.. ఇప్పుడే ఇలా తయారయ్యాడ’ని అంటున్నారు.


డా|| పద్మజ

సైకాలజిస్ట్

పెద్దవాళ్లు మీ ఇద్దరినీ సంప్రదించి పెళ్లి చేసినా కూడా మీ మధ్య చదువు, ఇతర విషయాల్లో తారతమ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. అతడు ఎలాంటి ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతున్నాడనే విషయంలో మీకు అవగాహన ఉందా? అలాగే నెలలో కొన్ని రోజులు తాగడం.. కొన్ని రోజులు తాగకపోవడం వంటి వైఖరి ఎందుకు కనిపిస్తుందో మీరు విశ్లేషణ చేయగలుగుతారా? అనేది ఆలోచించుకోండి.

ఏది ఏమైనా అతనికి సంబంధించిన వాళ్లు పట్టించుకోవడం లేదు.. అదే సమయంలో మీరంటే ఇష్టపడుతున్నట్టుగానూ, మాటిచ్చి దాని మీద నిలబడతానన్నట్టుగానూ చెబుతున్నాడు. మీ భర్త బలహీనతలో ఉన్నాడే తప్ప అది వ్యసనం దాకా వెళ్లలేదని అనిపిస్తోంది. కాబట్టి, మీ వాళ్ల సహాయ సహకారాలు మీకుంటే.. అతడి మందు అలవాటు వ్యసనంగా పరిణమించకముందే అతని బలహీనతలు, చెడు అలవాట్ల నుంచి అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి బయటకు తీసుకొచ్చే డీ-అడిక్షన్‌ సెంటర్లు కొన్నుంటాయి. వాటిని మానసిక నిపుణులు నిర్వహిస్తుంటారు. మీ భర్తను కూడా అలాంటి సెంటర్లకు తీసుకువెళ్లండి. మీ భర్త కొన్ని రోజుల పాటైనా నియంత్రణ కోల్పోకుండా ఉంటున్నాడు కాబట్టి మిగతా రోజులు కూడా అలానే ఉండేట్టు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

మీరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు కాబట్టి.. మీకు తగ్గ ఉద్యోగం చేసేందుకు ప్రయత్నించండి. అతని సంపాదనలో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చడానికి, ఒకవేళ ఇద్దరూ కలిసి సంపాదించుకునే క్రమంలో కొంత కుటుంబానికి, మరికొంత భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఇక మద్యపానం విషయానికొస్తే.. సోషల్‌ డ్రింకింగ్‌(అప్పుడప్పుడు మద్యం తాగడం) అయితే కొంతవరకు ఉండొచ్చు. కానీ అది ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటే.. అది అతనికి ఎలా అలవాటైందో మనకు తెలియదు. కాబట్టి మానసిక నిపుణుల సహాయంతో దాన్నుంచి మీ వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కేవలం ‘ఒత్తిళ్ల వల్ల మాత్రమే తాగుతున్నాను’ అని చెప్పడం వెనుక కారణాలను మీరు విశ్లేషించి చూడండి. ఆ ఒత్తిళ్లేంటో అర్థం చేసుకుని వాటి నుంచి ఆయన బయటపడేలా మీ వంతుగా సహాయం అందించండి.
Post Your Comment Here

(Press ctrl+g to switch(English/Telugu))

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))