సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

మీ ప్రశ్న అడగండి

(Press ctrl+g to switch(English/Telugu))

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి


ముందుగా మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.

మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.


Know More

నమస్తే మేడమ్‌.. మా పాప వయసు 12 ఏళ్లు. 7వ తరగతి చదువుతోంది. మా పాప 5, 6 తరగతులు బాగానే చదివింది. కానీ ఇప్పుడు సరిగ్గా చదవడం లేదు. మంచి మార్కులు కూడా రావట్లేదు. అలాగే కొన్ని రోజుల క్రితం తన స్కూల్లో టీచర్‌ పర్సులో నుంచి ఎవరికీ తెలియకుండా డబ్బు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న టీచర్‌.. స్కూల్‌ డైరెక్టర్‌కి కంప్లైంట్‌ చేస్తే.. సీసీ కెమెరాలు పరిశీలించి మమ్మల్ని పిలిపించారు. ఇంటికొచ్చిన తర్వాత పాపను అడిగితే నేను తీయలేదని అబద్ధాలు చెప్పింది. కొన్ని రోజుల క్రితం ఎగ్జామ్‌ రాసిన తర్వాత తిరిగి ఆ పేపర్ టీచర్లకి ఇవ్వలేదని తెలిసింది. వాళ్ల టీచర్లు ఎంతమంది అడిగినా ఇచ్చాననే సమాధానం చెప్పింది. అయితే ఇంటికొచ్చాక తిట్టి అడిగితే.. అప్పుడు కావాలనే పేపర్ ఇవ్వకుండా బయట పడేశానని చెప్పింది. ఇలా పాప అబద్ధాలు చెప్పకుండా ఎలా మాన్పించాలి? - ఓ సోదరి


ఈ సమస్యను రెండు కోణాల్లో చూడాలి. ఒకటి- అబద్ధాలు చెప్పే అలవాటు కేవలం ఇటీవలే మొదలుపెట్టిందా? లేకపోతే ఈ ఆలోచనా ధోరణి ఇంతకుముందు నుంచీ ఉందా?.. రెండోది- కేవలం ఏడో తరగతి వచ్చిన తర్వాతే గనుక ఆమె ఇలా ప్రవర్తిస్తోందంటే తనలో ఈ సమయంలో వస్తున్నటువంటి మార్పులేంటి? అనే విషయాలను శారీరక, మానసిక కోణాల్లోంచి ఆలోచించాలి. అలాగే మీ పాప ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పులేంటి అనేది గమనించాలి. ఉదాహరణకు.. తన స్నేహితుల్లో ఎవరైనా అలా ప్రవర్తించి తనపై ప్రభావం చూపించారా?, ఎవరైనా అలా చేయడం గురించి విన్నదా? లేదా తను ఏదైనా అలాంటి పని చేస్తున్నప్పుడు ఇతరులు ప్రశంసిస్తూ తను దాన్ని గొప్పగా భావించేలా చేశారా?, తమకు తెలిసో తెలియకో ఎవరైనా అలా చేయమని తనను ప్రోత్సహించారా? వంటి విషయాల గురించి కూడా ఆలోచించాలి.

అలాగే మీ పాప ఏ విషయంలోనైనా తన గురించి తాను తక్కువగా అంచనా వేసుకుంటోందా? లేదా తనకు శక్తి సామర్థ్యాలు లేవనే ఆత్మనూన్యత భావనలో ఉందా? అసలు మీరు ఆమె పట్ల తగిన శ్రద్ధ చూపిస్తున్నారా? ఇలా అన్నింటినీ క్రోడీకరించి తనలో వచ్చిన, వస్తున్నటువంటి మార్పులను విశ్లేషించాలి. ఈ క్రమంలో మీ పాపను తప్పనిసరిగా మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పాప ప్రవర్తనలో వచ్చినటువంటి ధోరణిని క్షుణ్ణంగా పరిశీలించి.. వారే తగిన పరిష్కారం చూపుతారు.


Know More

నమస్తే మేడమ్‌. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. నేను, నా భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో స్వదేశానికి రాబోతున్నాం. మా దాంపత్య జీవితం బాగానే ఉంది.. కానీ మావారి అక్క వల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త తన అక్క గురించి ఏ మాట చెప్పినా ఊరుకోడు. ఆమె మా ఇంట్లో ఒక్క రోజుంటే చాలు.. ఆ రోజంతా మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆమెకు పెళ్లై పదేళ్లవుతుంది. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయన కూడా ఆమె చెప్పినదానికల్లా తలూపుతారు. మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మా వారి అక్క కూతురు ఫోన్లో ఏమడిగినా అప్పటికప్పుడు కొనివ్వాల్సిందే. మా ఆయన ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో కూడా మా ఆడపడుచే చెబుతుంది. ఇలాంటివి తట్టుకోలేక ఉద్యోగం పేరు చెప్పి దూరంగా ఉంటున్నాం. అయినా మా పుట్టింటి వారు నాకు ఇచ్చే స్థలం గురించి అడిగి వేధిస్తున్నారు. త్వరలో స్వదేశానికి వస్తున్నాం అని తెలిసి.. అది తీసుకురా, ఇది తీసుకురా అంటూ ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. మేము మా పిల్లల కోసం కొంత మొత్తాన్ని దాచి.. మిగతాది తక్కువ బడ్జెట్లో వారు అడిగినవి కొనిద్దామనుకుంటున్నాం. కానీ వాళ్ల గొంతెమ్మ కోరికలు నా బిడ్డల భవిష్యత్తుకి ఆటంకమవుతాయేమోనని భయం పట్టుకుంది. మా వారికి డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెట్టడం ముందునుంచీ అలవాటు. దూరంగా వచ్చాక ఆ అలవాటు కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్లీ తాను అదే పద్ధతిని అనుసరిస్తే మా కష్టార్జితం గంగపాలవడం ఖాయం. దీని గురించి మా వారికి సున్నితంగా వివరించే మార్గం సూచించగలరు. - ఓ సోదరి


మీరు విదేశాల్లో ఉండగానే ఆర్థిక ప్రణాళికలు వేసుకొని, పొదుపు అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు.. మీ సంపాదనలో ఒక భాగం పిల్లల భవిష్యత్తు కోసం, ఒక భాగం కుటుంబ అవసరాల కోసం, ఒక భాగం మీ ఇద్దరి వ్యక్తిగత అవసరాల కోసం, ఒక భాగం కుటుంబ పొదుపు - స్థిరాస్తుల కొనుగోలు కోసం, ఒక భాగం మీ భర్త కుటుంబ సభ్యుల కోసం.. ఇలా మీ సంపాదనను కొన్ని భాగాలుగా విభజించుకొని కేటాయించుకోండి. అలాగే ఇద్దరూ పని చేస్తున్నారు కాబట్టి ఖర్చుల విషయంలో ఇద్దరికీ స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇద్దరి ఖర్చుల విషయంలో ఒక పరస్పర అంగీకారానికి రావడం మంచిది.

పైన చెప్పిన విధంగా మీరిద్దరూ కలిసి కొంత మొత్తాన్ని, విడివిడిగా కొంత డబ్బును ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటే.. రేపు పిల్లల భవిష్యత్తు ఎలాగా? అనే దిగులుండదు. అలాగే మీకంటూ ఒక ఇల్లు కానీ, పొదుపు కానీ, ఏదైనా స్థిరాస్థి కోసం తీసి ఉంచుతారు కాబట్టి.. మీకూ భవిష్యత్తు గురించి భయాలు ఉండవు. అలాగే మీ సంపాదనలో కొంతమేరకు కుటుంబం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించుకున్నప్పుడు నువ్వెందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవ్వదు.

ఇకపోతే మీ పుట్టింటి వారు మీకు ఇవ్వాల్సిన ఆస్తి గురించి అంటారా? మీ భర్తతో మీకు సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు వాళ్లు ఇచ్చే ఆస్తుల గురించి మూడో వ్యక్తి కల్పించుకోలేని వాతావరణాన్ని మీరిద్దరూ ఏర్పరచుకోండి. మీ పుట్టింటి వారు మీకిచ్చే విషయంలో గానీ, వాళ్ల దగ్గర్నుంచి మీరు తీసుకునే విషయంలో గానీ.. మీ భర్త తరపు వాళ్లు కల్పించుకోకుండా మీ భర్త మీకు అండగా నిలబడగలడేమో ప్రయత్నం చేసి చూడండి. మీరు అతన్ని నమ్మి.. అతను కూడా మిమ్మల్ని నమ్మితే మూడో వ్యక్తి మిమ్మల్ని కష్టపెట్టే విధంగా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అలాగే చిన్న చిన్న విషయాల్లో మీ భర్త తరపు వారు చెప్పే విషయాలు విన్నా.. జీవితంలో ముఖ్యమైన విషయాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకునేట్టుగా అవగాహనా సాన్నిహిత్యాన్ని పెంచుకోండి.

ఇక మీ భర్త అక్క విషయానికి వస్తే.. అతను ఆమెకి ఏ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం చేసుకోండి. ఆమె పరిణతితో కూడిన సలహాలు ఇస్తోందా? ఆమె సలహాలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడ్డాయా? ఇన్నేళ్ల సాన్నిహిత్యాన్ని పెళ్లవగానే దూరం చేసుకుంటే మిమ్మల్ని తప్పుబడతారన్న ఆలోచన అతనికుందా? వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఎంత దృఢంగా ఉంది?.. వంటి విషయాలన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంటుందో.. అక్కాతమ్ముళ్లుగా వాళ్ల మధ్య అనుబంధం కూడా అలాగే ఉంటుందని అర్థం చేసుకోండి. పైన చెప్పినట్టుగానే మీ వ్యక్తిగత విషయాల్లోకి మూడో వ్యక్తి తలదూర్చలేనంతగా మీ బంధాన్ని దృఢపరచుకోండి. అలాగే మీరు కూడా మీ భర్త తరపు వారికి అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టినప్పుడు అతనికి కూడా మీపై విశ్వాసం పెరుగుతుంది. వాళ్లు అడిగే వాటిలో సాధ్యం కానివి వదిలిపెట్టి.. మీ శక్తికి తగినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేట్టుగా ప్లాన్‌ చేసుకోండి.


Know More

నమస్తే మేడం.. నా వయసు 33 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు నాకు ఏడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. ఏదైనా సంబంధం వచ్చి మాకు ఏమాత్రం నచ్చకపోతే వాళ్లు నన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నారు. ఒకవేళ ‘సంబంధం బాగుంది.. కొన్ని విషయాలు సర్దుకుపోవచ్చులే..’ అనుకుంటే మాత్రం వాళ్లు నన్ను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. మాకు నచ్చకపోవడం అంటే నేను కానీ, నా తల్లిదండ్రులు కానీ ఏ విషయంలోనూ(చదువు, ఉద్యోగం, కుటుంబం.. వంటి విషయాల్లో) సర్దుకుపోలేమన్నమాట! అలా ఉంటున్నాయి నేను ఇష్టపడని, నన్ను ఇష్టపడే సంబంధాలు. ఇదే పరిస్థితి ఏడేళ్లుగా కొనసాగుతోంది. ఏదైనా సంబంధం వచ్చి నేను అబ్బాయిని ఇష్టపడ్డానంటే.. వాళ్లు నన్ను చేసుకోరని ముందే అర్థమవుతోంది. దాంతో చాలా నిరాశగా ఉంటుంది. అలా అని ఇష్టం లేని అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి? అలా ఇష్టం లేకుండా కొంతవరకు ముందుకు వెళ్లి, ఆ తర్వాత వదులుకున్న సంబంధాలు కూడా ఉన్నాయి. పెళ్లిచూపుల్లో అబ్బాయిని ఇష్టపడి సంతోషంగా పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జీవితానికి లేదేమో అనిపిస్తోంది. సమస్య ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. నాకు నచ్చని వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండిపోతానేమోనని భయంగా ఉంది. నన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్లనే నేను చేసుకోవాలని నా మనసుకి ఎలా సర్దిచెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో.. ఏం చేయాలో తెలియట్లేదు.. దయచేసి సలహా చెప్పండి. - ఓ సోదరి


ఏ సంబంధమైనా ఒకవైపు పూర్తి అనుకూలత ఉండి, మరోవైపు సంతృప్తి లేనప్పుడు.. అలాంటి సంబంధాలు కుదరడమనేది సాధ్యం కాదన్న విషయం వాస్తవమే. అయితే మీ విషయంలో.. మీ ప్రాధాన్యతలేంటి? వాటిలో అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చే అంశాలేంటి? కొంతవరకు ప్రాధాన్యత ఇచ్చినా సర్దుకుపోగల విషయాలేంటి? వంటి అంశాలను ఒక పట్టికలాగా తయారుచేసుకోండి. ఇలా మీరు కావాలనుకున్న లక్షణాలు ఏ సంబంధానికైతే అధికంగా కలుస్తు్న్నాయో వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టండి.

marriage7yearsghg650-1.jpg

మామూలుగా ఏదో సంబంధం వచ్చింది కదా? అని వెంటనే చూపులు ఏర్పాటు చేసుకొని.. అవతలి వారు నచ్చిందని, ఆ తర్వాత మీరు అతని గురించి విచారించి నచ్చలేదని చెప్పడం కంటే.. ముందే అతని గురించి, అతని కుటుంబ నేపథ్యం.. వంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాతే వాళ్లు మీకు నచ్చడం, మీరు వాళ్లకి నచ్చడం, పరస్పరం చూసుకునే దాకా ఆ సంబంధాన్ని తీసుకురావచ్చేమో ఆలోచించండి.

అయితే కొన్ని సందర్భాల్లో మనకు సాధారణంగా అనిపించినవి.. అవతలి వారు సాధారణం కంటే తక్కువ స్థాయిలోనో.. ఎక్కువ స్థాయిలోనో చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రాధాన్యతలన్నింటినీ వాళ్లు సంతృప్తిపరచలేకపోయినా మీ ముఖ్యమైన ప్రాధాన్యతలకు ఎంతవరకు దగ్గరగా వస్తున్నారనేది కూడా ఆలోచించుకోండి. ఏడు సంవత్సరాల నుంచి సంబంధాలు చూసినా కుదరడం లేదు.. కాబట్టి జీవితంలో పెళ్లే కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు, మీ వ్యక్తిత్వానికి తగిన గౌరవం ఇచ్చి, మిమ్మల్ని మీరుగా ఇష్టపడే వ్యక్తి తారసపడరని అనుకోకండి. కాకపోతే సంబంధాలు చూడడం కంటే, తగిన సంబంధాలు, భావసారూప్యత, కలకాలం కలిసి ఉండే కుటుంబాల నుంచి వచ్చే అబ్బాయిని చూస్తున్నారా? లేదా? అనేది ముందే ఆలోచించండి.

ఏడేళ్ల నుంచి మీరు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఈ పాటికి మీకు కొన్ని అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మీ ఆకాంక్షలు, ప్రాధాన్యతలు.. అవతలి వ్యక్తి స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయా? ఆచరణాత్మకంగా ఉన్నాయా? అనే కోణంలో కూడా పరిశీలించుకోండి. అలాగే మీకున్నట్టుగానే అవతలి వారికీ కొన్ని కోరికలు, ప్రాధాన్యతలుంటాయని తెలుసుకోండి. అయితే వాటికి మీరు ఎంతవరకు సరిపోయేట్టుగా ఉన్నారో ముందే ఆలోచించుకొని చూపుల దాకా వెళ్లడం మంచిది.


Know More

నమస్తే మేడమ్‌.. నా వయసు 37. నాకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. మాది లేటు వివాహం. నా భర్త నుంచి నేనో వింత సమస్యను ఎదుర్కొంటున్నాను. అతనికి నచ్చనిది ఏదైనా మామూలుగా అడిగినా అతని ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. ఉదాహరణకు మనం మన పెళ్లిని రిజిస్టర్‌ చేసుకుందాం అంటే ఆ డిస్కషన్‌లోకి వెళ్లకుండా రకరకాలుగా ప్రవర్తిస్తు్న్నాడు. తలని గోడకేసి రక్తం వచ్చేలా బాదుకోవడం, నేలను నాకడం, గోడకున్న ఫొటోలను తలకేసి బాదుకోవడం, గ్యాస్‌ లీక్‌ చేయటం, చుట్టూ సమాజాన్ని పట్టించుకోకుండా గట్టిగా అరవడం, బాత్రూం క్లీనర్‌ తాగడం, సబ్బు తినడం, ఫోన్‌ విరగ్గొట్టడం.. వంటివి చేస్తున్నాడు. మా వయసు రీత్యా పిల్లల కోసం డాక్టర్‌ దగ్గరకు వెళ్దామా? అన్నా కూడా ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా అతను తన ప్రవర్తనతో నన్ను, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు మారతారా? నేను ఎవరిని సంప్రదించాలి? సలహా ఇవ్వగలరు.


ముందుగా అతని కుటుంబ సభ్యులకు అతని ప్రవర్తన తీరు తెలుసో? లేదో? మాట్లాడి చూడండి. అతని ప్రవర్తన గురించి వాళ్ల కుటుంబ సభ్యులు, పెద్దవాళ్లతో కూడా చర్చించి.. ఆలస్యం చేయకుండా అతడిని మానసిక నిపుణుల వద్దకి తీసుకెళ్లడం మంచిది.


Know More

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి


మీరు ఇప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్నారని తెలుస్తోంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ముందూ వెనకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మీ గతం.. మీరు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి, అతని తల్లిదండ్రులకు తెలుసు. అయితే అతను వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి కొంత సమయం కావాలంటున్నాడని మీ ఉత్తరం తెలియజేస్తోంది. మీ అమ్మగారు ఈ పెళ్లి వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ, తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాలుంటాయని అర్థం చేసుకోండి.

ఒకసారి జీవితంలో బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా.. కొన్ని కొన్ని విషయాలను మీరు ముందే తెలుసుకోలేకపోయారు. అలాంటప్పుడు బయటి వ్యక్తి గురించి కొన్ని భయాలు ఉండడం సహజమే కదా.. దానికంటే ముందుగా మీకు అతనిపై ఉన్న మంచి అభిప్రాయాన్ని నిర్ధరించుకోవడం చేసుకోవడం అవసరం. మతాల అంతరాలు, కుటుంబాల్లో అవగాహనా లోపం వల్ల మీ ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంటుంది. అలాగే మీ అమ్మగారికి, మీ కుటుంబ సభ్యులకి, వాళ్ల కుటుంబ సభ్యులకి మధ్య ఒక అవగాహన వచ్చేలా మీరిద్దరూ చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల వాళ్ల మధ్య ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా ఆలోచించి, దీర్ఘకాలిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి.


Know More

నమస్తే మేడమ్‌.. నాకు 18 ఏళ్లు. నేను డిగ్రీ చదువుతున్నాను. మా కుటుంబ సభ్యులు నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. అయితే నాకు, మా బావకు మధ్య వయోభేదం 11 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్య వయసులో ఇంత అంతరం ఉంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? లేక అర్థం చేసుకుని కలిసుంటే ఆనందంగా ఉండగలమా? మా బావ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనంటే నాకూ ఇష్టమే. వ్యక్తిత్వ పరంగా కూడా బావ చాలా మంచివాడు. కానీ ముందు ముందు జీవితం ఎలా ఉంటుందనే ఆలోచనే నన్ను కలచివేస్తోంది. దయచేసి సలహా ఇవ్వగలరు.


పాత కాలంలో ఎక్కువ వయో అంతరంతో పెళ్లిళ్లు జరిగిన మాట వాస్తవమే.. పెళ్లి, ఆ తర్వాత బాధ్యతలు.. వంటి విషయాల్లో వాళ్లకి స్పష్టమైన అవగాహన ఉండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమగా మెలుగుతూ వాళ్లు జీవితాన్ని బాగానే కొనసాగించారన్న మాట కూడా నిజమే. కానీ, వర్తమాన పరిస్థితుల్లో అంత వయోభేదం ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందనేది ఆలోచించుకోవాలి. 11 సంవత్సరాల తేడా అంటే చదువు, ఆలోచనా విధానం.. వంటి విషయాల్లో అతనికున్నంత స్పష్టత మీకు ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ అంతరాల వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు దొర్లినా, భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే.. ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వయసు తేడాతో పాటు.. ఆలోచనల విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ తేడా ఉంటుంది.. కాబట్టి వాటిని ఒకరినొకరు స్వీకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉంటేనే అడుగు ముందుకు వేయండి.


Know More

మేడమ్‌.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్‌ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు అతనిని నీకు ‘దూమపానం, మద్యపానం.. వంటి అలవాట్లున్నాయా?’ అనడిగితే ‘లేవు’ అన్నారు. కానీ ఇప్పుడు తాగి ఆఫీసుకి కూడా సరిగా వెళ్లడం లేదు. నెలలో వారం, పది రోజులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అనడిగితే ఆర్థిక సమస్యలు, ఒత్తిడితో అలా తాగుతున్నానని అంటున్నాడు. వాళ్ల పెద్దవాళ్లకి చెబితే ‘పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవు.. ఇప్పుడే ఇలా తయారయ్యాడ’ని అంటున్నారు.


పెద్దవాళ్లు మీ ఇద్దరినీ సంప్రదించి పెళ్లి చేసినా కూడా మీ మధ్య చదువు, ఇతర విషయాల్లో తారతమ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. అతడు ఎలాంటి ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతున్నాడనే విషయంలో మీకు అవగాహన ఉందా? అలాగే నెలలో కొన్ని రోజులు తాగడం.. కొన్ని రోజులు తాగకపోవడం వంటి వైఖరి ఎందుకు కనిపిస్తుందో మీరు విశ్లేషణ చేయగలుగుతారా? అనేది ఆలోచించుకోండి.

ఏది ఏమైనా అతనికి సంబంధించిన వాళ్లు పట్టించుకోవడం లేదు.. అదే సమయంలో మీరంటే ఇష్టపడుతున్నట్టుగానూ, మాటిచ్చి దాని మీద నిలబడతానన్నట్టుగానూ చెబుతున్నాడు. మీ భర్త బలహీనతలో ఉన్నాడే తప్ప అది వ్యసనం దాకా వెళ్లలేదని అనిపిస్తోంది. కాబట్టి, మీ వాళ్ల సహాయ సహకారాలు మీకుంటే.. అతడి మందు అలవాటు వ్యసనంగా పరిణమించకముందే అతని బలహీనతలు, చెడు అలవాట్ల నుంచి అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి బయటకు తీసుకొచ్చే డీ-అడిక్షన్‌ సెంటర్లు కొన్నుంటాయి. వాటిని మానసిక నిపుణులు నిర్వహిస్తుంటారు. మీ భర్తను కూడా అలాంటి సెంటర్లకు తీసుకువెళ్లండి. మీ భర్త కొన్ని రోజుల పాటైనా నియంత్రణ కోల్పోకుండా ఉంటున్నాడు కాబట్టి మిగతా రోజులు కూడా అలానే ఉండేట్టు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

మీరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు కాబట్టి.. మీకు తగ్గ ఉద్యోగం చేసేందుకు ప్రయత్నించండి. అతని సంపాదనలో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చడానికి, ఒకవేళ ఇద్దరూ కలిసి సంపాదించుకునే క్రమంలో కొంత కుటుంబానికి, మరికొంత భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఇక మద్యపానం విషయానికొస్తే.. సోషల్‌ డ్రింకింగ్‌(అప్పుడప్పుడు మద్యం తాగడం) అయితే కొంతవరకు ఉండొచ్చు. కానీ అది ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటే.. అది అతనికి ఎలా అలవాటైందో మనకు తెలియదు. కాబట్టి మానసిక నిపుణుల సహాయంతో దాన్నుంచి మీ వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కేవలం ‘ఒత్తిళ్ల వల్ల మాత్రమే తాగుతున్నాను’ అని చెప్పడం వెనుక కారణాలను మీరు విశ్లేషించి చూడండి. ఆ ఒత్తిళ్లేంటో అర్థం చేసుకుని వాటి నుంచి ఆయన బయటపడేలా మీ వంతుగా సహాయం అందించండి.


Know More

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది. మాకు రెండు సంవత్సరాల బాబున్నాడు. నా భర్త.. నాకు, నా చిన్నప్పటి స్నేహితుడితో ఇంకా సంబంధం ఉందని అంటున్నాడు. నాకు నవంబర్‌లో నెలసరి రావడం ఆలస్యమైంది. దాంతో ఆయన ‘నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నావు.. ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ఆ శుభవార్తను అతనితో చెప్పు’ అని అంటున్నాడు. దాన్ని బట్టి అతని గురించి నేనేమనుకోవాలి? మరో విషయం ఏంటంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో మా శృంగార జీవితంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఈ క్రమంలో నేను నా స్నేహితుడిని ఆనందపరుస్తున్నానేమో అని అన్నాడు. కానీ, తను నన్ను అలా అనడం నాకు నచ్చలేదు. దాంతో నేను నా భర్తను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. మీరే నాకు సలహా ఇవ్వగలరు.


మీ ఉత్తరం చివరి వాక్యంలో మీ సమస్య గురించి మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా రాశారు. ఒకవేళ మీరు నిర్ణయం తీసేసుకుంటే ‘ఏం చేయమంటారు’ అని మరొకరిని అడగడం ఏమాత్రం అవసరమో ఆలోచించుకోండి. ఆ విషయం కాసేపు పక్కకు పెడితే, మీ చిన్ననాటి స్నేహితుడు మీ జీవితంలోకి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రవేశించడం, అతను మీ పట్ల ఇష్టా్న్ని వ్యక్తం చేయడం, మీకూ ఇష్టం ఉందనే ఉద్దేశంతో అంగీకరించడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం.. తిరిగి స్నేహాన్ని కొనసాగించడం.. ఇవన్నీ గమనిస్తే మీ స్నేహం ఎత్తుపల్లాలతో కూడినదిగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో.. దానిని మీరు ప్రేమగా నిర్వచించుకున్నారా? ఒకవేళ చిన్ననాటి స్నేహితుడు కాకుండా స్నేహితురాలు కలిసుంటే మీకు ఇలాంటి భావనే ఉండేదా? అనేది మీరు ఆలోచించుకోండి. అసలు మీ ఇద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందా? లేక మీ మధ్య ఉన్న స్నేహాన్ని మరో విధంగా చెప్పుకుంటున్నారా? అనే విషయాన్ని కూడా మీరే ధృవీకరించుకోండి.

మీరు మీ తల్లిదండ్రుల మాటకు విలువిచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత మీ కాపురం సంతోషంగా ఉండదని అతను జోస్యం చెప్పడం, నిజంగానే అతను చెప్పినట్లు జరుగుతుందని మీరు అనుకోవడం అనేవి ఎంత వరకు సాధ్యమో ఆలోచించుకోండి. ఒకవేళ నిజంగా మీ పట్ల ప్రేమ, గౌరవం ఉన్న వ్యక్తి అయితే మీ జీవితం సంతోషంగా ఉండదని జోస్యం ఎందుకు చెప్తాడు? మీ ఇద్దరి మధ్య అంత ఇష్టం ఉంటే.. కేవలం ఫోన్‌లో కాకుండా బయటకు వచ్చి మీ తల్లిదండ్రులతో ఎందుకు చెప్పలేదు? ఫోన్లలో మాట్లాడుకున్నంత మాత్రాన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా? అనేవి మీకు మీరే తరచి చూసుకోవాల్సిన విషయాలు. అలాగే మీ ఇద్దరూ కలిసి మీ తల్లిదండ్రులను ప్రత్యక్షంగా సంప్రదించారా? వారి ఇష్టాయిష్టాలను కనుక్కున్నారా? ఒక్కసారి వెనక్కి వెళ్లి మీ జీవితంలో జరిగిన ఈ విషయాల గురించి ఆలోచించి చూడండి.

intercoursegapgh650-1.jpg

మీకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడని రాశారు. మీపై ఇన్ని రోజులు రాని అనుమానం మీ భర్తకు ఇప్పుడే ఎందుకు కలిగింది? మీ భర్త మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కేవలం స్నేహం మాత్రమే అని అనుకునే పరిస్థితులున్నాయా? అసలు అతనికి మీపై వేరే రకమైన అనుమానం రావడానికి కారణం ఏమిటి? ఒకవేళ అతను మిమ్మల్ని నిరాధారంగా శంకిస్తున్నాడనుకుంటే.. దానిని పోగొట్టడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అనేవి పరిశీలించుకోండి. అలాగే అతను మిమ్మల్ని మానసికంగా బాధిస్తున్నాడనుకున్నప్పుడు, ఆ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పారా? నిజంగా మీ చిన్ననాటి స్నేహితునితో ఇంకా సంభాషణ కొనసాగుతుందా? లేక పాత స్నేహాన్ని పునాదిగా తీసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడా? అనేది ఆలోచించుకోండి.

ఈ క్రమంలో ఒకవేళ మీపై నిరాధారమైన ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని నిరూపించడానికి ఏం చేయాలి? ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? అనేవి మీకు మీరే ప్రశ్నించుకోండి. మీ భర్తతో ఉన్న అనుబంధాన్ని ఇంకా కొనసాగించుకోవాలనుకుంటే.. ఇద్దరూ కౌన్సిలింగ్‌కి వెళ్లండి. రెండు వైపుల నుంచి బంధాన్ని ఎలా దృఢపరచుకోవాలో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు రాసిన ఉత్తరంలో చివర్లో చెప్పినట్టుగా మీరు మీ నిర్ణయం ఇప్పటికే తీసేసుకుంటే.. తదనంతర పరిణామాల గురించి మీ కుటుంబ సభ్యులు, మీకు సహాయం చేయగలిగిన వారితో మాట్లాడండి.


Know More

మేడమ్‌... మా పాప వయసు 9 సంవత్సరాలు. ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తుంది. అంతేకాదు.. మొండిగా తయారై.. చదువులో కూడా వెనుకబడింది. నాకు 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అతను ముద్దుగా ఉంటాడు. కానీ పలు ఆరోగ్య సమస్యలున్నాయి. మేము ఎక్కువ గారాబం చేయడం వల్ల మా అమ్మాయి అలా తయారై ఉండచ్చు. బహుశా ప్రతి విషయంలోనూ పిల్లలిద్దరి మధ్య ఉన్న పోటీతత్వం (తోబుట్టువుల వైరం) వల్లే అలా చేస్తుందేమోనని అనిపిస్తోంది. అందుకే మా పాపతో ఎక్కువ సమయం వెచ్చించి చూశాను. కానీ తనలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. మేము కొంతకాలం వేచి చూడాలా? లేకపోతే వెంటనే సైకాలజిస్టుని కలవమంటారా? మా పాపను మామూలు స్థితికి తీసుకురావడానికి ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వగలరు.


మీ అమ్మాయి మొదటి నుంచి ఇలాగే ఉందా? ప్రతి దానికీ ఏడుస్తుందా? తను అనుకున్నది సాధించాలనుకుంటుందా? చదువులో మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపించడం లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియాలి. ఒకవేళ మీ అమ్మాయి తమ్ముడు పుట్టిన తర్వాతే ఇలా చేస్తుందంటే తల్లిదండ్రులుగా మీరే ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలో ఆలోచించుకోవాలి. మీ బాబు చక్కగా, ముద్దుగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటాడని రాశారు. అలాంటి సందర్భంలో మీ సమయం, శ్రద్ధ, ఆలోచనలన్నీ అతనికే కేటాయించాల్సిన అవసరం వచ్చుండచ్చు. అదే సమయంలో మీ నుంచి మీ అమ్మాయికి సరైన శ్రద్ధ అందక.. ఒంటరిగా ఉన్నాననే భావన కలిగి ఉండచ్చు. కొన్నిసార్లు మొండితనం చేయడం వల్ల తన పట్ల మీరు శ్రద్ధ చూపిస్తే.. అది తనకు తెలియకుండానే అలవాటుగా మారుండచ్చు. ఇలా మీ శ్రద్ధను పొందడానికి తను చేసే ప్రయత్నాలతో చదువు మీద శ్రద్ధ తగ్గి ఉండచ్చు.

siblingrivalryexpert650-1.jpg

అలాగే మీరు ఇద్దరు పిల్లల మధ్య పని, సమయాన్ని విభజన చేసుకునే క్రమంలో ఇది వరకు చూపించినంత శ్రద్ధ ఇప్పుడు చూపించగలుగుతున్నారో లేదో చెప్పలేదు. అలాగే తన వయసు పెరిగే కొద్దీ చదువు స్థాయి కూడా క్రమంగా పెరుగుతుంది. అలా తన స్థాయి పెరిగే కొద్దీ దానికి తగిన విధంగా ఆ అమ్మాయి మానసిక స్థితి ఉంటుందా? అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. దాంతో పాటు ఆమె తండ్రికి మీ అమ్మాయి పట్ల శ్రద్ధ చూపించడానికి ఎంత వరకు వీలవుతుంది? అనే విషయాన్ని భార్యభర్తలిద్దరూ కలిసి ఆలోచించుకోవాలి.

మీరు మొదట బాబు ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ బాబు ఆరోగ్యంగా మారాక అక్క, తమ్ముడు ఇద్దరూ కలిసి చేసే పనుల్లో వారిని ప్రోత్సహించండి. అందులోనూ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావనను రాకుండా జాగ్రత్తపడండి. ఒకవేళ అక్కగా తమ్ముడిని బాగా చూసుకుంటే.. ఆమెని ప్రశంసించండి. అలా చేయడం వల్ల ఆమెకి ప్రశంసలతో పాటు మీరు ఆమెపై శ్రద్ధ చూపిస్తున్నారనే భావన కూడా కలుగుతుంది. అలాగే తనతో హోంవర్క్‌ చేయించేటప్పుడు, తనను చదివించేటప్పుడు పూర్తి ఏకాగ్రత ఆమెపై ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఆమెతో ఎక్కువ సమయం కేటాయించానని చెప్పారు. అయితే అలా గడిపిన సమయంలో ఆమె ఎంత సంతృప్తి చెందుతుంది అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే మీ దంపతులిద్దరూ, పాప, బాబు.. అందరూ ఒక్కటే అనే విషయాన్ని ఆమెకి చెప్పే ప్రయత్నం చెప్పండి. అయితే ప్రాక్టికల్‌గా ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది పూర్తిగా అర్థం కాకపోవచ్చు. దానికి మీరు సైకాలజిస్టుని కలిసి మీ పరిస్థితుల్ని వివరించండి. వారు అమ్మాయి మానసిక స్థితి, ప్రజ్ఞా స్థాయిని పరీక్షిస్తారు. అలాగే మీ వైపు నుంచి అమ్మాయికి ఎలాంటి సహాయం చేయాలనేది కూడా వారు వివరిస్తారు.


Know More